నరసింహ స్వామి అనుగ్రహం కోరే భక్తులు ఖచ్చితంగా చదువుకోవాల్సింది శ్రీ నరసింహ శతకము. తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది . ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి. ఈ పద్యాలన్నీ

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అనే మకుటంతో అంతమవుతాయి.  ఈ పద్యాలలోని ఓ గొప్ప పద్యం మీకు అందిస్తున్నాము. దీన్ని చదివితే స్వామి వారు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని చెప్తారు. ఆ పద్యం..తాత్పర్యం ఇదిగో..

సీ. మందుడనని నన్ను – నిందజేసిన నేమి? – నా దీనతను జూచి – నవ్వనేమి?
     దూరభావము లేక  – తూలనాడిన నేమి? – ప్రీతిసేయక వంక – బెట్టనేమి?
     కక్కసంబులు పల్కి – వెక్కిరించిన నేమి? – తీవ్రకోపము చేత – దిట్టనేమి?
     హెచ్చుమాటల చేత – నెమ్మలాడిన నేమి? – చేరి దాపట గేలి – సేయనేమి?

తే. కల్పవృక్షము వలె నీవు – గల్గ నింక – బ్రజల లక్ష్యంబు నాకేల – పద్మనాభ!
     భూషణవికాస! శ్రీధర్మ – పుర నివాస! – దుష్ట సంహార ! నరసింహ ! – దురితదూర!

తాత్పర్యము :-

ఓ నారసింహ స్వామీ! మందబుద్ధననీ, దీనుడననీ నిందించినా, నవ్వినా, ఆలోచించకుండా కసిరి కొట్టినా, మేలుచేయక తప్పులెంచినా, తూలనాడినా, తిట్టినా, కాని మాటలన్నా, వెక్కిరించినా, యీ ప్రజలు ఏమి చేసినను, ఓ పద్మనాభా! కల్పవృక్షము వంటి  నీవు నాకు అండగా ఉండగా వాళ్లందరినీ లక్ష్య పెట్టు పని నాకెందుకు స్వామీ!