శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు. ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి. ఆయన రాసిన ఓ పద్యం యొక్క అర్దం, ప్రతిపదార్దం ఇక్కడ చూడండి..ఎంత అద్బుతంగా ఉందో….

రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం
భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా
బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞానల
క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా!

తాత్పర్యం
శ్రీ కాళహస్తీశ్వరా! రాజులు అన్ని విధములుగ మత్తులు. వారి సేవ నరకబాధతో సమానము. వారు మెచ్చిన ఇత్తురు సుందర స్త్రీలు, మేనాలు, పల్లకీలు, గుఱ్ఱములు, భూషణములు మొదలైనవి. ఇవి చిత్తమునకు ఆత్మకు వ్యధ కలుగుటకు మూలసాధనములు. వాటియందు కోరిక కూడదు. వానిని కోరి ఇంతవరకు నేను చేసిన రాజసేవ చాలును. వానితో తగిన సంతృప్తిని పొందినాను. ఇక వారివలన ఏవిధమైన లక్ష్మి వలదు. నీవు నన్ను అనుగ్రహించి పరిపాకము పొందిన జ్ఞానలక్ష్మీజాగృతిని యిమ్మని వేడుచున్నాను.