కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదనేది సత్యం.  కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుందని చెప్తారు. అది నిజం కూడాను. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ “శ్రీ వేంకటేశ్వరుడు” గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది. ఆయన పాదాలే మనకు శరణాగతి. అందుకే… శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే.అర్దం ఇలా చెప్తారు.!!

వేం – పాపము
కట – తీసేయడం
శ్వరుడు – కర్మ తొలగించేటటు వంటివాడు  అని ఆయన్ని కొలుస్తూంటాము.

 ఆ పరమాత్ముడు నివసించే తిరుమలని కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ శ్రీమహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు.

ఇక ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి.

శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధము.

శ్రీహరిని అవమానించినవీ పాదములే!
సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే!!
భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే!!!
లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే!
సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే!!

ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే! మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే..!
శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన “ఇల” వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే!

శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు, బంగారు పాదకవచాలను పక్కకు తీసి- స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు.  అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట- భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు.  అదీ శ్రీవారి పాదాలకున్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడిచేతిని- పాదాల వైపు చూపి దర్శించుకో.. తరిస్తావంటాడు. ఆయన తానున్నాని సూచించడానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు.

శ్రీ వేంకటేశం శిరసా నమామి
సంమోహ దూరం స్సుఖ శిరుసారం
దాక్షిణ్యభావం దరహాస శోభం
రాజాధి రాజం రమయా విహారం
శ్రీ వేంకటేశం శిరసా నమామి