భారత్‏లోని అత్యంత పవిత్ర శైవ పుణ్య క్షేత్రాల్లో  ఒకటైన  అమర్ నాథ్ కి  భక్తులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెళ్లడం కుదరదు. జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో అమర్ నాథ్ కొలువుదీరింది. హిమాలయాల్లో ఉండే కఠినమైన వాతావరణం పరిస్థితుల కారణంగా సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే అక్కడకు వెళ్ళెందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తేదీల కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సంవత్సరం (2022) అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన తేదీలను, రిజిస్ట్రేషన్ తేదీలను ప్రకటించారు అధికారులు.  ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది. ఎల్జీ మనోజ్ సిన్హా నేతృత్వంలో జరిగిన అమర్నాథ్ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 అమర్ నాథ్ లో ప్రతి ఏటా మంచు లింగం ఏర్పడడం తెలిసిందే. ఇక్కడ వేసవిలో తప్ప మిగతా అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. కాగా, ఇక్కడి గుహలో మంచుతో ఏర్పడే లింగాకృతిని భక్తులు శివుడి ప్రతిరూపంగా భావిస్తారు. ప్రతి ఏటా అమర్ నాథ్ కు కొన్ని వేల మంది భక్తులు తరలి వచ్చి ఈ మంచు లింగాన్ని దర్శించుకుంటారు.  ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర తేదీలు ఖరారు చేసింది. జూన్ 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర 43 రోజుల పాటు కొనసాగనుంది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజున యాత్ర ముగియనుంది.

జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన నేడు అమర్ నాథ్ ఆలయ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాత్ర తేదీలను నిర్ణయించారు. అయితే, కరోనా వ్యాప్తి ఇంకా ముగియలేదని, అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ యాత్ర నిర్వహించాలని తీర్మానించారు.   ఈ యాత్రలో పాల్గొనడానికి 13 సంవత్సరాల కంటే తక్కువ, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి అనుమతి ఉండదు.  సముద్ర మట్టానికి దాదాపు 3వేల 880 మీటర్ల ఎత్తులో అమర్ నాథ్ గుహలు ఉంటాయి.  యాత్రికులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అమర్ నాథ్ గుహల్లో ఇచ్చే హారతిని 15 రోజుల పాటు భక్తుల కోసం లైవ్ లో టెలికాస్ట్ చేస్తారు