ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి శ్రీసత్య సాయి జిల్లాలోని ధర్మవరానికి చెందిన జురాజు నాగరాజు అనే నేతన్న అద్భుతమైన కళా ఖండాన్ని ఆవిష్కరించి వార్తల్లో నిలిచారు. 60 మీటర్ల పట్టు చీరపై 13 భారతీయ భాషల్లో ఏకంగా 32, 200 సార్లు ‘జై శ్రీరామ్’ అనే నామాన్ని డిజైన్ చేసి రూపొందించాడు. ‘రామకోటి వస్త్రం’ గా పిలవబడుతున్న ఈ వస్త్రం అంతటా చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు, ఆ పట్టు వస్త్రంపై రామాయణ ఘట్టాలను సైతం డిజైన్ చేశాడు. నాగరాజు నేసిన ఈ చీరను చూసి చాలామంది అబ్బురపడుతున్నారు. ఆయన ప్రతిభను అభినందిస్తున్నారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది. నాగరాజు స్వయంగా రూపొందించిన ఈ ప్రత్యేకమైన పట్టు వస్త్రాన్ని ‘రామ కోటి వస్త్రం’గా పిలుస్తున్నట్లు నాగరాజు వివరించారు.
ఈ పట్టు వస్త్రంపై రామాయాణంలోని సుందరకాండలోని 168 ఘట్టాలను కళ్లకు కట్టేలా రూపొందించినట్లు వెల్లడించాడు. దీన్ని రూపొందించడం అంత సులువు కాదని.. దీని కోసం చాలా కష్టపడినట్టు వివరించారు. ఖర్చు కూడా భారీగానే అయ్యిందని తెలిపాడు. ఈ పట్టుచీర దాదాపు 16 కిలోల బరువు ఉంటుందని, 44 ఇంచుల వెడుల్పు ఉన్న ఈ చీరను రూపొందించేందుకు 4 నెలల సమయం పట్టిందని పేర్కొన్నాడు. దీని కోసం సుమారు 15 లక్షలు రూపాయలు ఖర్చయ్యిందన్నారు. ఈ చీరను రూపొందించేందుకు తనకు మరో ముగ్గురు సహాయం చేసినట్లు వివరించారు ఈ చీరను అయోధ్య రామాలయంలో రాముడికి సమర్పించనున్నట్లు చెప్పుకొచ్చాడు.