ధైర్యానికి, అభయానికి మారుపేరు ఆంజనేయుడు.ఆంజనేయ స్వామి భక్తులకు ఆయన శక్తి సామర్ద్యాలు పూర్తిగా తెలుసు. ఒకసారి ఆయన్ని స్మరిస్తే ఎలాంటి పనులు అయినా ధైర్యంతో చేసేయగలుగుతాం అని చెప్తారు. అసలు ఆయన జీవితంలోనే ఆ సాహసం ఉంది.ఆంజనేయులువారు ఎంతటి శాస్త్ర పాండిత్యం, దేహబలం, ధైర్య సాహసాలు కలవాడో అంతటి బుద్ధిశాలి. అందుకే ఆయనకు ప్రపంచం నలుమూలలా భక్తులు ఉన్నారు. అదే క్రమంలో పాకిస్దాన్ లోనూ ఆయనకు ఆలయం ఉంది.

మన దేశంలో హనుమాన్ ఆలయాలు ఊరూరా ఉంటాయి. అదేవిధంగా మన దేశం నుండి విభజన జరిగిన పాకిస్తాన్ లో అనేక హిందూ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కరాచిలోని పంచముఖి ఆలయం. పాక్ హిందూ సంఘం పాకిస్తాన్ లో అనేక హిందూ దేవాలయాలను పరిరక్షిస్తుంది..వాటిని నిర్వహించి భారతీయ సంస్కృతిని పోషిస్తోంది.

శ్రీరామభక్తుడు ఆంజనేయస్వామి స్వయంభువుగా కరాచీలో వెలిసారు. ఇక్కడి శ్రీ పంచముఖి హనుమాన్‌ మందిరం యుగయుగాల నుంచి పూజలందుకుంటోంది.  వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్షణుడితో కలిసి ఇక్కడ విడిది చేసినట్టు స్థానిక స్థలపురాణం చెబుతోంది. పాక్‌లోని హిందువులు ప్రతి ఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. పురావస్తుశాఖ అధ్యయనంలో ఈ ఆలయం 1500ఏళ్ల క్రితం నిర్మించినట్టు వెల్లడయింది.

ఆలయం ఇప్పుడు ఉన్న ప్రదేశంలో నీలం మరియు తెలుపు 8 అడుగుల విగ్రహం చాలా శతాబ్దాల క్రితం నుండి పూజలందుకోంటోంది. ముందు వాకిలిలో నలుపు మరియు తెలుపు పాలరాయి అంతస్తుతో ఇరువైపులా చెక్కిన పసుపు రాయి స్తంభాలు ఉన్నాయి, సవ్యదిశలో ప్రదక్షిణ కోసం విస్తృత మార్గం (పరిక్రమ / ప్రదక్షిణ) దాని చుట్టూ ప్రదక్షిణలు  చేస్తారు.

 పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం హనుమ, నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, గరుడ ముఖాలతో దర్శనమిస్తుంది. ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహం భక్తులకు అభయమిస్తుంది.  ఈ ఆలయంలో మూలవిరాట్‌ ఉన్న ప్రాంగణంలో  21 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరువెరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు.  ఆలయ ప్రాంగణ తవ్వకాల్లో పురాతనమైన అనేక విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని ఆలయప్రాంగణంలో ప్రతిష్టించారు. పాక్‌లోని కరాచీలో హిందువులకు శ్రీ పంచముఖి  హనుమాన్‌ ఆలయం పవిత్రమైన ప్రదేశం.