ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అన్నారు. బతుకమ్మ ఉత్సవాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు బిఆర్‌కెఆర్ భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ ఉత్సవాలను అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్ 3వ తేదీన ట్యాంకుబండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, ట్యాంక్‌బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్డు మరమ్మతుల పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఈ సారి మహిళలు ఉత్సవాలలో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని అన్నారు. బతుకమ్మలను నిమ్మజ్జనం చేసే ప్రాంతాల్లో ఏ విధమైన ప్రమాదాలు జరుగకుండా ఈతగాళ్లను నియమించాలని ఆదేశించారు.

బతుకమ్మ పండగ పై ఆకర్షణీయమైన డిజైన్‌లతో మెట్రో ఫిల్లర్లపై అలంకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులు రమణాచారి మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలు మన రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనవని అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.

ఎల్ బి స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని అన్నారు.