శ్లో𝕝𝕝 ఆయుర్వర్షశతం నృణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం తస్యార్థస్య
పరస్య చార్థమపరం బాలత్వవృద్ధత్వయోః|
శేషం వ్యాధివియోగదుఃఖసహితం సేవాదిభిర్నీయతేజీవే
వారితరంగచంచలతరే సౌఖ్యం కుతః ప్రాణినా||

తా𝕝𝕝 మనిషి ఆయుర్ధాయం నూరు సంవత్సరాలు…. అందులో సగం కాలం(50సం.లు) రాత్రులలో (నిద్రలో) గడిచిపోతుంది….. ఇలా మిగిలిన 50సం||లలో బాల్యం, వృద్ధాప్యం క్రింద మరో పాతికేళ్లు గడిచిపోతాయి….. పొట్టకూటికై వారికీ వీరికీ దాస్యం చేయటంలోనూ (ఉద్యోగాలు మొ||వాటితో) రోగాలు, వియోగాలు దుఃఖాలతో మిగిలిన కాలమంతా గడిచిపోతుంది…..నీటికెరటం వలే క్షణభంగురమైన మానవజీవితంలో సుఖమెక్కడ???

ఏనుగు లక్ష్మన కవి గారు క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు.  భర్తృహరి సంస్కృతంలో రచించిన “సుభాషిత త్రి శతిని” తెలుగులోనికి “సుభాషిరత్నావళి” పేరు మీదఅనువాదం చేసినాడు. సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు. భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు 1. ఏనుగు లక్ష్మణ కవి 2. పుష్పగిరి తిమ్మన 3. ఏలకూచి బాల సరస్వతి.

వీటన్నింటిలోను ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి “ఏనుగు లక్ష్మణ కవి” అనువాదాలు.  ముఖ్యంగా ఏనుగు లక్ష్మణ కవి యొక్క అనువాదము యధామూలంగా, మనోహరంగా ప్రౌఢ శైలిలో సందర్భోచితంగా ఉండినదై మూలకవి యొక్క హృదయాన్ని అర్ధం చేసుకుని పండిత పామరులకు సైతం అర్ధం చేసుకొనే విధంగా అందరినీ ఎంతో మెప్పించింది.