రెండు సంవత్సరాల తరువాత స్వామి వారి కల్యాణ వేడుకలకు భక్తులు రావటానికి అవకాసం కలుగుతోంది. కరోనా తో భక్తులు దర్శనాలు ఆపుచేసారు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం భద్రాద్రి రామయ్య కళ్యాణం భక్త సందోహం మధ్య జరపాలని…, ఏర్పాట్లులో ఎక్కడా. రాజీ పడకుండా విధులు నిర్వహించి స్వామి ఆశీస్సులు పొందాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌తెలిపారు. ఈ నేపధ్యంలో  ఇప్పటికే భద్రాచలం సబ్‌ ‌కలెక్టర్‌ ‌కార్యాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ… అధికారులకు అప్పగించిన విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేసి కార్యాచరణ నివేదికలు అందచేయాలని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదని ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేద్దామని చెప్పారు. కోవిడ్‌ ‌నిబంధనలు వల్ల రెండు సంవత్సరాలు భక్తులకు అనుమతి లేకుండా పోయిందని, ఈ సంవత్సరం భక్తులకు అనుమతి ఉంటుందని అందువల్ల వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని చెప్పారు. పర్ణశాల, భద్రాచలంలో వేడుకులు జరిపించే పెద్ద కార్యక్రమమని సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.  

ఎండల నుండి భక్తులకు రక్షణగా మంచి గాలి, వెలుతురు వచ్చే విధంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సెక్టారులోని భక్తులు ఇతర సెక్టారులలోనికి ప్రవేశించకుండా బారికేడింగ్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులకు సమాచారం అందించేందుకు కొత్తగూడెం, కిన్నెరసాని, భద్రాచలంలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కరకట్ట రైలింగ్‌ను మరమ్మత్తులు నిర్వహించి రంగులు వేయాలని, కరకట్టపై ఎల్లోడి విద్యుత్‌ ‌దీపాలు, బొమ్మలను కూడా సరిచేసి అందంగా రంగులు వేయాలని చెప్పారు. పట్టణం మొత్తం పండుగ వాతావరణం రావాలని, గోదావరి వంతెనపై కూడా విద్యుద్దీకరణ చేయాలని చెప్పారు. దేవాలయాలన్ని విద్యుద్దీకరణతో బంగారు వర్ణ దీపాలతో అందంగా ముస్తాబు చేయాలని చెప్పారు.

రామాయణ ఇతివృత్తాలను భక్తులకు తెలియచేయు విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. స్వామి వారిని దర్శించుకునే దివ్యాంగులకు, గర్భిణిలకు, వయోవృద్ధులకు ప్రత్యేక లైను కేటాయించాలని చెప్పారు. భక్తులకు కల్పించనున్న ఉచిత భోజన సదుపాయాలను ఆహార తనిఖీ అధికారి, తహసిల్దార్‌ ‌పర్యవేక్షణ చేయాలని, కల్తీ జరుగకుండా పరీక్షలు. నిర్వహించాలని చెప్పారు. హోటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించి దరలను నిర్ణయించాలని చెప్పారు.

బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా తలంబ్రాలు పంపిణీ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అధికారులకు సూచించారు. స్వామి వారి ప్రతిష్టతపై ప్రధాన రహాదారుల్లో హోర్డింగులు ఏర్పాటు చేయాలని చెప్పారు. స్వామి వారి వేడుకలను వీక్షించడానికి వొచ్చే భక్తులు సులభంగా టిక్కెట్లు కొనుగోలు చేయడానికి వీలుగా వారం రోజుల్లో ఆన్లైన్‌ ‌ద్వారా టిక్కెట్లు విక్రయాలు ప్రారంభించాలని దేవస్థానం అధికారులకు సూచించారు. అస్వస్థతకు గురైన భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రాధమిక చికిత్సా కేంద్రాలు ఏర్పాటుతో పాటు ప్రధాన హాస్పిటల్‌లో అత్యవసర చికిత్సా వార్డు, ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలని వైద్యాధికారులకు సూచించారు.

విద్యుత్‌ అం‌తరాయం లేకుండా నిరంతర విద్యుత్‌ ‌సరఫరా చేయు విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అగ్నిమాపక వాహనాలను, సెక్టారులో అగ్ని నియంత్రికలను ఏర్పాటు చేయాలని అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. ఎప్పటికపుడు వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేసేందుకు పట్టణాన్ని సెక్టారులుగా విభజించి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని డిపిఓకు సూచించారు.

15 రోజులు ముందుగానే పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా తయారు చేయాలని చెప్పారు. తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని, దుర్వాసన రాకుండా పరిశుభ్రత పాటించాలని, పారిశుధ్యం చాలా ముఖ్యమని, పారిశుధ్య కార్యక్రమాలను భక్తులు మెచ్చుకునే రీతిలో ఉండాలని చెప్పారు. వాహనాల తనిఖీ చేపట్టాలని, ఆటో, టాక్సీ యజమానులతో సమావేశం నిర్వహించి దరలను నిర్ణయించాలని రవాణ అధికారులను ఆదేశించారు. వంతెనపై వాహనాలు ఆపకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు.

ఉత్సవాల రోజుల్లో మద్యం, మాంసాహార విక్రయాలు లేకుండా పటిష్ట తనిఖీలు చేపట్టాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రహదారులకు మరమ్మత్తులు నిర్వహించాలని చెప్పారు. ప్రోటోకాల్‌ ‌సమస్య రాకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సబ్‌ ‌కలెక్టర్ కు  సూచించారు.