మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 19 వరకు మూడు రోజులపాటు జాతర జరగుతోంది. జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 75 కోట్లు ఖర్చు పెట్టింది. మహా జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.  భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చూసుకుంటోంది. ఈ నేపధ్యంలో  మేడారం జాతరకు  హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి.

 తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభించింది. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసులు నడపుతున్నారు. దీని కోసం చార్జీలను కూడా నిర్ణయించారు.

హనుమకొండ నుంచి మేడారానికి వెళ్లి రావడానికి ఒకరికి రూ.19,999 ఛార్జీ నిర్ణయించారు. అలాగే  8 నుంచి 10 నిమిషాల జాతర  ఏరియల్ వ్యూ చూడడానికి చార్జీ రూ.3700గా ఖరారు చేశారు. కరీంనగర్, హైదరాబాద్  నుండి హెలికాఫ్టర్ ప్రయాణ సర్వీసుతోపాటు వసతి సౌకర్యాల కోసం ఒక్కొక్కరికి రూ75వేలు, అలాగే మహబూబ్ నగర్ నుంచి రూ.1 లక్ష వసూలు చేస్తారు. డిమాండ్ ను బట్టి హెలికాఫ్టర్ సర్వీసులను ఈనెల 20 వ తేదీ వరకు నడపాలని నిర్ణయించారు.

టికెట్ బుకింగ్‌ కోసం 94003 99999, 98805 05905 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. info@helitaxii.com వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు. హెలికాప్టర్లలో వెళ్లేవారి కోసం హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఒక్కో ట్రిప్పులో ఆరుగురు వెళ్లేందుకు వీలుంటుంది.

నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో ఇబ్బందిపడ్డ భక్తులు, ప్రజలు ఈసారి మేడారం జాతరకు కుటుంబ సమేతంగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు, పర్యాటక శాఖ అంచనా వేస్తోంది.