దేవుడికి మన ఇష్టకామాలను (కోరికలు) చెప్పుకొంటాం. మన కోరికలు వినే దైవాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయం ఒకటి.  శ్రీశైలంలో మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం.

భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కన్నా మరో ఆలయం కనిపించకపోవటం విశేషం. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరిదేవి దర్శనం చేసుకోలేరు. అమ్మ అనుగ్రహం ఉన్న అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్తారు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది.

భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టుపెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా, ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు.  ఎన్నో సంవత్సరాలుగా వేలాది మంది భక్తులు ఈ అనుభూతిని పొందుతున్నారు. దేవి మందహసంతో భక్తులకు దర్శనం ఇస్తున్నది.

భక్తులకు దేవిపై అపార నమ్మకం. రెండు మూడు మార్లు ఈ దేవిని దర్శించిన వారున్నారు. మళ్ళీ మళ్లీ వస్తుంటారు. దానికి కారణం వారు వచ్చివెళ్లిన తర్వాత వారు కోరిన కోరికలు సాఫల్యం కావడమే. కోరికలు తీరినందుకు కృతజ్ఞతాభావంగా ఆలయం సందర్శించి మళ్ళీ కొత్త కోరికలు అప్పగించి వెడతారు.  అవీ నెరవేరుతాయి. దీనితో మళ్ళీమళ్లీ వస్తారు.

ఇష్టకామేశ్వరి విగ్రహం అరుదైనదని, ఇలాటి విశిష్టత కలిగిన విగ్రహం దేశంలో మరెక్కడా లేదు.  ఇంతకు ముందు అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.

ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు అమ్మవారు కనిపిస్తారు. ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ఇక్కడ పరిసరాల్లో కూర్చుకుని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. స్థానికంగా నివసించే చెంచులచే అమ్మవారు పూజలందుకుంటున్నారు.

ఎంతోకాలం క్రిందట అడవిలో కొందరు చెంచులకు అమ్మ విగ్రహం కనిపించిందని, వారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు జరిపారని, ఇప్పటికీ వారి సంతతి వారే ఆలయ అర్చకులుగా వ్యవహరి‌స్తున్నారని స్థానికులు చెబుతున్నారు.