హిందూ దేవుళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంటుందనే సంగతి తెలిసిందే. ఏదో ఒక జంతువు, పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు. అలా తొలి పూజలందుకునే వినాయకుడి వాహనంగా మూషికం ఏర్పాటైంది. అయితే మూషికం ఆయనకు వాహనంగా మారిన వెనక కథ ఒకటి ఉంది. అదేమిటో చూద్దాం.

 ఒకరోజు దేవతలంతా ఇంద్ర సభలో సమావేశమయ్యారు. ఇందులో గంధర్వులు, కిన్నెరలు, అప్సరసలు సైతం పాల్గొన్నారు. ఓ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా, క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు. చర్చలో అనేకమంది పాల్గొన్నా, అప్సరలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు. క్రౌంచుడి తీరును శ్రీమహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు. దీంతో ఇంద్రుడు ఆగ్రహించి, తక్షణమే ఎలుకగా మారమని శపించాడు. తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరినా, ఫలితం దక్కలేదు.

iamge courtesy : wikipedia

మూషికంగా మారిన తర్వాత కూడా తన ప్రవర్తనతో దేవతలకు విసుగు తెప్పించాడు. దీంతో ఇంద్రుడు అతడిని దేవలోకం నుంచి తరిమేయాలని ఆదేశించాడు. భటులు దాన్ని తరిమేయడంతో భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలోనూ రుషులకు ఇబ్బందులు కలిగించి, ఒకరోజు ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుడ్ని విడిచిపెట్టలేదు. విసిగిపోయిన పరాశరుడు అతనిని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుని అడిగాడు. పరాశరుని కోరిక మన్నించిన వినాయకుడు అతడిపై దాడికి సిద్ధమయ్యాడు.

గణేషుడు తన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా అది మూషికం మెడకు చుట్టుకుని ఆయనకు చెంతకు తీసుకొచ్చింది. భయపడిపోయిన మూషికం క్షమించమని కోరాడు. క్షమించిన వినాయకుడు, మళ్లీ పొరపాటు చేయరాదని హెచ్చరించాడు. తాను క్షమించినా మూషికం సంతోషంగా లేదని వినాయకుడు గ్రహించాడు. అప్పుడు మూషికంకు తనతో ఉండాలనే కోరిక ఉన్నట్లు గ్రహించాడు. దాంతో మూషికంని తన వాహనంగా చేసుకున్నాడు. ఏ కార్యం ప్రారంభించినా ఆదిదేవుడు వినాయకుని పూజించడం ఆనవాయితీ, కాబట్టి గణేశుడితోపాటటు పూజలందుకునే వరాన్ని మూషికంకి ప్రసాదించాడు. దీంతో గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు. ఇక్కడ మరొక సమస్య వచ్చింది. వినాయకుడి బరువును మోయలేను కాబట్టి తేలికగా మారమని కోరాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు.

మిగతా దేవతలందరూ వేగంగా పరుగెత్తే జంతువులు, పక్షులను తమ వాహనంగా ఎంపిక చేసుకుంటే, దీనికి భిన్నంగా వినాయకుడి మూషికాన్ని తన వాహనంగా మార్చుకున్న విషయం ఇది.