తెలంగాణా రాష్ట్రములో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో పేరెన్నికగన్న వాటిలో ఒకటి వేములవాడ.. ఉమ్మడి జిల్లాలో ఇది కరీంనగర్ జిల్లా కిందికి వస్తుంది. ప్రస్తుతం జిల్లాల విభిజనలో సిరిసిల్లా జిల్లా కిందికి వస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు ఎములాడ రాజన్నను మొక్కుకుని కొడుకు పుడితే కోడెగడుతా రాజన్నా అంటూ నిత్యం వేలాది మంది భక్తులు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తరలివస్తుంటారు.

రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయంగా పేరుండి, ఆదాయంలోనూ మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో శ్రీస్వామి వారికి వచ్చే ఆదాయంలో సింహ భాగం కోడె మొక్కుల ద్వారానే సంక్రమిస్తుంది. వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో అధిక శాతం భక్తులు కోడె మొక్కు చెల్లించుకున్న అనంతరమే ఇతర మొక్కులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కోడె మొక్కు అనేది ఇతర దేవాలయాల్లో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న గుడిలో కొనసాగుతోంది. ఈ కోడి మొక్కుల వెనక కథేంటో చూద్దాం.

 ఈ కోడె మొక్కులు సంప్రదాయానికి స్దల పురాణం ప్రకారం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శ్రీకారం చుట్టాడు. శ్రీకృష్ణుడు, జాంబవతి దంపతులకు రాజరాజేశ్వరుడి అనుగ్రహంతో సాంబుడనే కొడుకు కలిగాడు. పుత్రుణ్ని వరంగా ప్రసాదించిన రాజన్నకు కోడెను మొక్కుగా చెల్లించుకున్నాడట శ్రీకృష్ణుడు. నేటికీ కోడె మొక్కు సంప్రదాయం కొనసాగుతుండటం విశేషం. పాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి దక్షిణాపథం యాత్రకు వెళ్లినట్లు చెప్తారు. దీనికి నిదర్శనంగా రాజన్న క్షేత్రంలో సోమేశ్వర, ఉమామహేశ్వర, బాలరాజేశ్వర, భీమేశ్వర తదితర శివలింగాలు పాండవులు ప్రతిష్ఠించినవిగా చెబుతారు.

పంటలు బాగా పండాలని రైతులు, కుటుంబాలు బాగుండాలని భక్తులు, తమ సమస్యలు తీరాలని మరికొందరు కుల, మతాలకు అతీతంగా ఎములాడ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకుంటుంటారు.

ఈ ఆలయంలో స్వామివారికి కుడిపక్కన రాజరాజేశ్వరి అమ్మవారు ఎడమవైపు లక్ష్మీ సమేత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి.ఈ ఆలయంలో కోడే మొక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.కోడెలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవరణంలో కట్టేయడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. అంతే కాకుండా ఈ ఆలయంలో ఉన్న గండ దీపాన్ని వెలిగిస్తే వారికున్న మరణ గండం తొలగిపోతుందని భక్తులు ఎక్కువగా విశ్వసిస్తారు.ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ దినాన్ని పురస్కరించుకొని పెద్దఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగుతుంది.

ఈ పుణ్యక్షేత్రం హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు , కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షణ కాశిగా పిలివబడే ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతీ సమేతుడై రాజరాజేశ్వరస్వామి కొలువై ఉన్నాడు.