మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు . మహా శివరాత్రి రోజు ప్రతిఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామస్మరణతో గడపడం, ప్రదోషవేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేస్తూంటారు. అసలు శివరాత్రి రోజు ఏమేమి చేయాలని మన శాస్త్రాలు చెప్తున్నాయో చూద్దాం.

మహా శివరాత్రి రోజు బ్రహ్మీ మూహూర్తంలో నిద్రలేచి ఇల్లాంత శుభ్రపరచుకుని శుచిగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజగదిలో ముగ్గులు వేసుకుని రక రకాల పూలతో అలంకరించుకోవాలి.

లింగకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో , ఆవుపాలతో , పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో , పుష్పాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను , బిల్వపత్రాలను , తుమ్మిపూలను , గోగుపూలు , తెల్లని , పచ్చని పూలతో శివనామాలను కాని పంచాక్షరీ మంత్రమైన ఓం నమశ్శివాయ అని స్మరింస్తూ పూజించాలి.

తాంభూలం , చిలకడ దుంప (రత్నపూరీ గడ్డ ) అరటి పండు , జామపండు , ఖర్జరపండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్టతో శివ అష్టోత్తరం , పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. ప్రాతఃకాలం నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టాఐశ్వరాలు , సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో గనక శివున్నిఅభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివున్ని బోళాశంకరుడని పేరు. భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్ధం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివ నామాలను , శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభఫలితాలు పొందుతారు.

 శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారింట్లో ఉన్న శివలింగానికి లేదా బొటనవేలికి మించని ఓ శివలింగానికి (స్ఫటిక లింగమైనా/వెండి లింగమైనా) శివనామస్మరణ చేస్తూ పంచామృతములతో, బిల్వ పత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో, పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.