తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సార్క జాతర ఈ ఏడాది వైభవోపేతంగా జరిగిన సంగతి తెలిసిందే. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణా రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర కన్నుల పండువగా సాగింది. ఈ నేపధ్యంలో మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు.

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో హుండీల లెక్కింపు జరగుతోంది. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 497 హుండీలను..సీలు వేసిన అనంతరం హనుమకొండకు తరలించారు అధికారులు. హుండీలు ఉంచిన కల్యాణమండపం వద్ద గత కొన్ని రోజులుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక హుండీ లెక్కింపు కోసం దేవాదాయశాఖ నుంచి ఆదేశాలు అందడంతో బుధవారం నుంచి హుండీల లెక్కింపు ప్రారంభం అయ్యింది.

మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలను తెరిచారు. ఇప్పటివరకు రూ.1,34,60,000 ఆదాయం రాగా.. అధికారులు బ్యాంకులో జమ చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు కోటి మందికిపైగా తరలించారు.

300 పైగా సిబ్బంది పలు విభాగాలుగా విడిపోయి ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారు. హుండీలను తెరిచేందుకు ఒక టీమ్ ..వాటిలోని నోట్లు, వెండి, బంగారు వస్తువులను వేరుచేసేందుకు మరో టీమ్ పనిచేస్తుంది. కానుకల సమర్పణ సమయంలో బెల్లం, పసుపు- కుంకుమ అంటిన నోట్లను, వస్తువులను శుభ్రం చేసేందుకు ఒక  టీమ్ పనిచేస్తుంది. లెక్కించేందుకు ఒక టీమ్, లెక్కించిన నోట్లను కట్టలుగా కట్టేందుకు కూడా ఒక  స్పెషల్ టీమ్ పనిచేస్తుంది. సమ్మక్క సారలమ్మ ఆలయ యంత్రాంగం సహా దేవాదాయశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంటారు. హుండీ లెక్కింపుకు వచ్చే సిబ్బందికి ప్రత్యేక “డ్రెస్ కోడ్” కూడా ఉంటుంది.

దాదాపు పది రోజుల పాటు జరగనున్న హుండీ లెక్కింపులలో.. ఏ రోజు ఆదాయాన్ని ఆ రోజే బ్యాంకులో జమచేయనున్నారు అధికారులు. సారలమ్మ దేవస్థానం సిబ్బంది, పలువురు స్వచ్చంద సేవకులతో కలిసి ఈ హుండీ లెక్కింపులో పాల్గొననున్నారు.