#Bathukamma: తొమ్మిదిరోజుల ‘బతుకమ్మ’ వేడుక ..ప్రత్యేక నైవేద్యాలు..

0
112

తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల వేడుక యావత్ తెలంగాణకు ఎంతో ప్రత్యేకం. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. బతుకమ్మ అనేది ఒక ఉత్సాహపూరితమైన, రంగురంగుల పూల పండుగ. ఈ ఉత్సవం రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. సంవత్సరాలుగా దాని సాంస్కృతిక గుర్తింపుతో చెరగని బంధం కలిగి ఉంది. వర్షాకాలం చివరిలో జరుపుకుంటారు. ఈ ఉత్సవం మహాలయ అమావాస్య రోజున ప్రారంభమవుతుంది;

తెలంగాణలో సాంప్రదాయాలకు ప్రతీక ‘బతుకమ్మ’ పండుగ..ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిదిరోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరికోరి తెచ్చి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలు ఆడతారు..ఇది మహిళల పండగ అంటారు..

9 రోజుల వేడుకలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేక ఉంది. ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పిలుస్తారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో పిలవగా.. చివరి రోజున సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. అసలు బతుకమ్మ ఏ రోజున మొదలవుతుంది.. ఏ రోజున ముగిస్తుంది.. ఏ రోజు ఏపేరుతో పిలుస్తారు.. ఏ రోజున ఏ రకమైన నైవేధ్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
  2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
  3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
  4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
  5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
  6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
  7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
  8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
  9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

ఇకపోతే తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, పోక బంతి, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు గుమ్మడి, గులాబీ, పట్టుకుచ్చులు పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారుచేసిన బతుకమ్మలను తీసుకొని ఆలయాలలో, వీధులలో అందరూ గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాలలో ఆడి,పాడతారు.