తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ జ్యోతిష పండితులు, పంచాంగ కర్త, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్‌ సిద్ధాంతి (70)  కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని తన ఆఫీస్ లో  జ్యోతిషం చెబుతుండగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే రామలింగేశ్వర సిద్ధాంతి తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.

ములుగు సిద్ధాంతిగా పేరొందిన రామలింగేశ్వర సిద్ధాంతి 30 ఏళ్లుగా జ్యోతిషులుగా విశేష సేవలందిస్తూ వస్తున్నారు. రాశిఫలాలతో పాటు, ఆయన చెప్పే జ్యోతిషాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం నమ్ముతూంటారు. ఎన్నికలు, ప్రకృతి విపత్తులు.. ఇలా పలు అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు తన అంచనాలను వెలువరించేవారు. చాలా వరకూ నిజం అయ్యేవి.  ఆయన మృతిపట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ములుగు సిద్ధాంతి అంత్యక్రియలు సోమవారం ఉదయం 11 గంటలకు మలక్‌పేట్ రేసుకోర్సు సమీపంలోని హిందూ స్మశాన వాటికలో నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రామలింగేశ్వర సిద్ధాంతి  ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాల నుంచి వచ్చే వారికి జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు చూపడం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులయ్యారు. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించారు.

  ప్రతి సంవత్సరం పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా మహమ్మారి నుండి ప్రపంచానికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలో ఆయుష్య హోమాలు నిర్వహించారు. టీవీలో వారఫలాలు చెబుతూ ఎంతో మందికి చేరువయ్యారు.  15 ఏళ్లుగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి పంచాంగం అందిస్తున్నారు.  ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తున్నారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తూ..ఆయన మృతికి daivabhakti.com నివాళులు అర్పిస్తోంది.