ఎక్కడెక్కడ రామనామము వినబడుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. రామ భక్త పరాయణుడు, బహుపరాక్రమశాలి, ఘోటక బ్రహ్మచారి శ్రీ ఆంజనేయుడు. రావణ సంహారం మాత్రమే రామాయణ పరమార్ధం కాదు. ఆ త్రేతాయుగాన చెలరేగిన అధర్మాన్ని, బహుభార్యత్వాన్నీ, అసత్యాన్నీ కూడా నిర్మూలించడం,మనిషిలోని దుర్గుణాలన్నీ తొలగించడమే రామావతారం ఉద్దేశం. ఈ విషయాన్ని హనుమంతుని ద్వారా లోకంలో ప్రతీ సారీ గుర్తు చేయబడుతోంది.  అసలు ఈ హనుమంతుడు ఎవరు…రామునితో ఈ బంధం ఏమిటి?

ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఈ పవనపుత్రుడు శ్రీ రాముడునే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటిరానంత ఎదగటం మనం గమనించవచ్చు. ముఖ్యంగా సముద్రాన్ని దూకి లంకను చేరి సీతమ్మ జాడను రాముడికి చేరవేశాడు. శ్రీ రాముడు.. రావణుడిని వధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ వీరాంజనేయుడు.. యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోగా సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుడు ప్రాణాలు నిలిపిన మాహా ధీశాలి. రాముడి పట్ల తనకున్న అపారమైన భక్తితో చిరంజీవిగా ప్రజల గుండెల్లో నిలిచాడు.

రామాంజనేయుల బంధం భక్తుడు, భగవంతుడికి ఉండే సామాన్య సంబంధం కాదు. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య నడిచిన అనుబంధం. సేవలందుకునే రాముడు, సేవించుకునే హనుమంతుడు ఇద్దరూ భగవంతులే. నరత్వం ఒకరిది. వానరత్వం ఇంకొకరిది అని పెద్దలు చెప్తారు. రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఇక హనుమంతుడు బుద్ధిమంతులలో వశిష్ఠుడు. చిటికలో వ్యూహాలు అల్లగల అత్యంత  చతురుడు రాముడు. చిటికెలో ఎలాంటి ఘనకార్యాలనైనా క్షణాలలో సాధించుకు రాగల కార్యధురీణుడు హనుమంతుడు. తండ్రి మాటకు కట్టుబడినవాడు రాముడు, రాముడి మాటకు కట్టుబడినవాడు హనుమంతుడు.

భక్తి గురించి మాట్లాడుకోవలసి వస్తే హనుమంతుడిని ఉదాహరణగా చెప్పుకుంటాం. అంతటి రామభక్తుడు కాబట్టే సాక్షాత్తు రాముడు తన గుండెల్లో కొలువున్నాడు అని గుండెని చీల్చి చుపించాడు. తన అణువణువునా రాముడు కొలువై ఉన్నాడు. రాముడు కూడా తన సోదరుడైన భరతుడితో సమానంగా అబిమానించాడు. వీరిద్దరి మధ్య ఉన్న భక్తి, ప్రేమ గురించి ఎన్ని గ్రంథాలు రాసిన తక్కువే!

శివుని విల్లు ఎక్కు పెట్టినవాడు రాముడు. శివుని మనసు తెలిసి మసలుకునేవాడు హనుమంతుడు. రాముడు సూర్యవంశజుడు. హనుమంతుడు సూర్యుని అనుంగు శిష్యుడు. సూర్యుని ముఖతః వేదవేదాంగాలు, సర్వశాస్త్రాలు ఉపదేశం పొందినవాడు ఆంజనేయుడు. రామకార్య నిర్వహణే జన్మకారణమైనవాడు, అదే గురుదక్షిణగా సమర్పించుకోవాల్సినవాడు హనుమంతుడు. రాముని మనసెరిగి మసలుకునే గొప్ప బంటు హనుమంతుడు. హనుమ మనసులో కొలువుండి హృదయస్ట్రుడిగా దర్శనమిచ్చే భగవానుడు రాముడు.

‘శివస్య హృదయం విష్ణోః విష్ణ్యస్థ హృదయం శివః’ అన్నమాటకు ఈ అనుబంధం రూపుకట్టినట్టుగా ఉంటుంది. సరిసమాన స్థాయిలో ఉండే హరిహరులే మానవాళికి స్వామి అనే వాడు ఎలా ఉండాలి? భక్తుడు ఎలా ఉండాలి? ఆ మర్యాదలు, మన్ననలు ఎలా ఉండాలో తెలియజేయడమే పరమ ప్రయోజనంగా ఈ ఇద్దరూ అవతారాలు స్వీకరించారు.  Purana Facts about Lord Sri Ram and Hamuman