నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం, నిజమైన భక్తిని కలిగి ఉండటమే హనుమంతుడు ఆదర్శం. హనుమంతుడికి ఉన్న భక్తి పారవశ్యం మరి ఎవరిలోనూ చూడలేం. అంతటి గొప్ప భక్తిని సీతారామ లక్ష్మణులపై ఆంజనేయుడు చూపిస్తాడు. అంతేకాదు పిల్లలు, యువత‌రానికి చాలా ఆద‌ర్శంగా నిలిచే గొప్ప దైవం హనుమంతుడు. ఇంతటి గొప్ప గుణాలు కలిగి ఉన్న ఆంజనేయ స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం..  రామాయణం సుందరాకాండలో ఒక హనుమంతుడు రావణునితో చేసిన సంభాషణ ని గమనిస్తే అది మనకు అర్దమవుతుంది.

Image Courtesy : Wikipedia

లంకేస్వరా! సుగ్రీవ సందేశం తో నీ దగ్గరకు వచ్చాను. ఆయన సోదర ప్రేమతోనీ కుశలం అడగమన్నాడు. ఆయన చెప్పిన మాటలు సావధానంగా వింటే ఇహపరాలలో నీకు శ్రేయస్సు కలుగుతుంది. ముందు రామసుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. సీతాన్వేషణ భారం వహించాడు సుగ్రీవుడు. ఆడిన మాట ప్రకారం వానర సేనలను నాలుగు దిక్కులకు పంపించాడు. వారిలో నేను వాయుదేవునకు ఔరసుడనైన హనుమంతుడను. నూరు యోజనాల సముద్రం దాటి లంకలో సీతమ్మను చూసాను.
నిన్ను చూసాను. నువ్వు కూడా ధర్మం ఎరిగినవాడవు, తపస్వివి, ప్రాజ్ఞుడవు. అటువంటి నీకు పరభార్యాపహరణం ఉచితం కాదు. నీ వంటి ధీమంతులు ధర్మాన్ని అతిక్రమించి ప్రమాదాలు కొని తెచ్చుకోరు.

రామలక్ష్మణులు ధనుర్బాణధరులై నిలబడితే దేవాసురులైనా వారికి ఎదురు నిలవలేరు. రాముని మనసుకు కష్టం కలిగించిన వాడెవడూ సుఖంగా ఊపిరి తీసుకోలేడు. ఈ విషయాన్ని విస్మరించకుండా త్రికాలహితమూ, ధర్మార్ధ సంయుతమూ అయిన నా మాట విని ఆయన భార్యను ఆయనకు అప్పగించు. ఆయన ఎవరనుకుంటున్నావో ! మానవరూపం ధరించిన దైవం.

ఇక – నేను సీతమ్మ జాడ తెలుసుకున్నాను మిగిలిన పని అవలీలగా సాగిస్తాడాయన.  నువ్వు సీతను అపహరించడం అంటే అయిదు పడగల పాముతో  చేలగాటమే. విషాన్ని తిని బ్రతికేవాడుండడు కదా ! అలానే సీతను అపహరించడమూ .. తీవ్ర సాధనతో తపస్సు చేసినవాడవు. ధర్మపరుడవు. కనుక నీ ప్రాణాలు తీయడం అంత  న్యాయం కాదు. దేవాసురలకు నిన్ను చంపడం సాధ్యంకాదు కానీ  మానవుడైన రాముడు, వానరుడైన సుగ్రీవుడు వస్తున్నారు. అధర్మం మీద ధర్మం విజయం సాధించి తీరుతుంది.

Image Courtesy : Wikipedia

జనస్థానంలో నీ యోధులందరూ రాముని చేతులలో నేల కూలిన విషయం విన్నావు. మహావీరుడైన వాలి మరణించిన వార్తా విన్నావు. రామ సుగ్రీవ మైత్రి తెలిసింది. ఇంక నీ శ్రేయోమార్గం తెలుసుకోవాలి.  సీతాపహరణం చేసినవానిని తనే స్వయంగా సంహరిస్తానని శపధం చేసాడు. ఆయన మాట తప్పనివాడు. రాముడు క్రోధాగ్ని, సీత తెజోగ్ని. ఈ రెండు లంకను నాశనం చేస్తుంటే చూడక తప్పదు నీకు. నా మాట విను . నీ సచివ, సామంత, బంధు మిత్రకోటిని రామబా ణాగ్నికి ఇంధనం చేయకు. విష్ణు పరాక్రమ సముడైన రాముని ఎదుట నిలువగలవాడు లేడు. చర్ముఖుడు, త్రినేత్రుడు, సహస్రాక్షుడు వీరెవరూ రాముని ముందు నిలవరు. ఆయన తలుచుకుంటే వేరెవ్వరూ అభయం కూడా ఇవ్వలేరు అన్నాడు.

ఇక్కడ హనుమంతుని వాక్చాతుర్యం చూడండి. ఒకపక్క రామునికి దుఖం కలిగించిన రావణుని మీద క్రోధం ఉన్నా నిదానంగా అతనిలో ఉన్న సుగుణాలను పొగుడుతూ అతను చేసిన అపరాధాలను ఎత్తి పొడుస్తూ రామునితో వైరంవల్ల రాబోయే పరిణామాలను హెచ్చరిస్తూ అతి నైపుణ్యంగా సంభాషణ జరిపాడు. ఊరికే ఆవేశపడిపోకుండా అతి చాకచక్యంగా చెప్పవలసినివి చెప్పాడు. ఇది మనందరమూ హనుమంతునివద్ద నేర్చుకోవలసినది.

అత్యంత బలగం కలిగిన రావణ లంకకు వెళ్లి.. వాళ్లతో పోరాడిన మెన్నత భక్తుడు ఆంజనేయుడు. శ్రీరామ చంద్రుడు, సుగ్రీవుని మధ్య సంధి కుదర్చడంలో.. హనుమంతుడు ప్రత్యేక పాత్ర పోషించాడు. ప్రస్తుత రోజుల్లో సంధి కుదిరించే లక్షణాలు కలిగి ఉండటం వల్ల మనం ఉన్నత స్థానాలకు చేరవచ్చు. నిలకడ స్వభావం హనుమంతుడు సముద్రాలు దాటి లంక చేరుకున్నారు. ఈ గొప్ప కార్యం ద్వారా అతని ఓర్పు, నిలకడ స్వభావాన్ని తెలుసుకోవచ్చు. తనకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడానికి హనుమంతుడు ఎన్ని కష్టాలనైనా ఓర్పుతో ఓర్చుకునే గొప్ప లక్షణం ఉంది.