జీవితంలో వివాహం అనేది  ప్రధానఘట్టం. కానీ ఈ రోజుల్లో రకరకాల కారణాలతో  సరైన వయస్సు వచ్చినా వివాహం కావటం లేదు.  అదో పెద్ద సమస్యగా మారిపోతోంది.  చాలామందికి అన్ని ఉన్నా వివాహం మాత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. దీనికి కాలమాన పరిస్దితుల దృష్ట్యా అనేక రకాల కారణాలు ఉంటాయి. మరో ప్రక్క జాతకంలో ఆయా గ్రహాలు ఉన్నస్థానాల ద్వారా ఇది సంభవిస్తుంది అని జ్యోతిష పండితులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంజనేయ స్వామి వారిని శ్రద్ధతో, విశ్వాసంతో చేస్తే తప్పక వివాహం అవుతుందనేది పౌరాణికుల మాట. ఆ వివరాలు తెలుసుకుందాం.

వివాహం కోసం ప్రార్థించే వారు గురువారం సాయంత్రం హనుమంతుడిని పూజించాలి. గురు, శనివారాల్లో నిమ్మకాయను, వడమాలతో హనుమంతుడిని పూజించడం ద్వారా అనుకున్న వివాహ,శుభ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

అలాగే శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు శివ కళ్యాణం చేయించాలి. ఆ తర్వాత నలభై రోజులు పాటు  రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం చేయాలి.

అంతేకాదు మండలం రోజులు పాటు  సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె వివాహ కార్యాలలో విజయం సిదిస్తుంది.

 వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాన్ని  వివాహ కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు. వివాహం జరిగి..జీవితంలో పడతారు.

ఆంజనేయుడిని పూజిస్తే శివుడిని, విష్ణువును కలిసి పూజించిన పుణ్యం లభిస్తుంది. రామాయణంలో హనుమంతుడు ప్రధాన పాత్ర. గురు, శనివారాలు హనుమంతునికి ముఖ్యమైన పూజాదినములు. వెన్నతో హనుమంతుడిని పూజిస్తే వెన్న కరిగిపోయినట్లే కష్టాలు తొలగిపోతాయనేది ఉవాచ.