ఏరుల పుట్టుక, యోగుల పుట్టుక ఎవరికీ తెలియదని మన పెద్దలు అంటుంటారు. ఏరయినా, యోగయినా మానవ జీవనానికి ఎంతో ముఖ్యం అనేది కాదనలేని సత్య. ఆ క్రమంలోనే మహా యోగి అయిన సాయిబాబా పుట్టుక గురించికూడా ఇంతకాలం ఎవరికీ తెలియదు. బాబా 16 ఏళ్ల వయసులో (1854లో) మొదటిసారిగా షిర్డీ వచ్చారని ‘సాయి సచ్చరిత్ర’లో రాసి ఉంది. బాబాతో సన్నిహితంగా తిరిగిన అన్నాసాహెబ్ ధాబోల్కర్ (హేమాండ్పంత్) రాసిన ఈ పుస్తకాన్ని స్వయంగా బాబా జీవిత చరిత్రగా భక్తులు భావించి, నిత్యం పారాయణ చేస్తుంటారు. రెండోసారి 1858లో 20 ఏళ్లప్పుడు ఒక పెళ్లి బృందంతో కలిసి షిర్డీ వచ్చి ఇక వెళ్లలేదని, ఖండోబా మందిరం దగ్గరే స్థిరపడిపోయారని చెబుతారు. అయితే అదే సమయంలో ఆయన దత్తాత్రుయుని అవతారం అని చెప్తూంటారు.

సుమారుగా వందేళ్ల క్రితం ఈ నేల మీద నడిచిన అవధూత సాయిబాబా. ఆయన దత్తాత్రేయుని అయిదో అవతారంగా జనం నమ్ముతున్నారు. ఆరాధిస్తున్నారు.  దత్తాత్రేయుడు భక్తులనుఉద్దరించుటకై అనేక దత్తావతారములు గ్రహించుచున్నాడు. శ్రీ పాద శ్రీవల్లభునిగా, నృసింహ సరస్వతిగా, మాణిక్య ప్రభువుగా, అక్కల్కోట మహారాజుగా, షిర్డి సాయిబాబాగా, గజానన మహరాజుగా, వాసుదేవానంద సరస్వతిగా, ఇలా ఎన్నో అవతారాలను ఎత్తుచున్నాడు. ఈ అవతార పురుషులందరూ తాము దత్తావతారులని ప్రత్యక్షంగా, పరోక్షంగానో సూచిస్తుంటారు. ఇంకా వేరే ఏకత్వములో భిన్నత్వము చూపుటకై వివిధ దేవీ, దేవతలుగా సాక్షాత్కరించి భక్తులను శుభ్రమార్గములో నడుపుచున్నారు.

దత్తవతారం దశావతారాలకంటే ఎంతో పురాతనమైనది. అన్ని అవతారాలు తమకు నిర్ధేశించిన కార్యము పూర్తిచేసుకొని ఈ లోకమునుండి నిష్క్రమించాయి. దత్త అవతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది. ఇది శిష్టరక్షణకు, దుష్టశిక్షణకు కొరకే గాక, ప్రజలకు జ్ఞానప్రభోధం చేసి, వారిని సన్మార్గంలో చేయడానికి వచ్చిన విలక్షణ అవతారం. ఏ అవతార మూర్తికీ లేని గురుదేవ అన్న విశేషణం దత్తాత్రేయుల వారికి మాత్రమే ఉంది.

బాబా ఎందరో అవదూతల రూపంలో మనకు దర్శనం ఇచ్చి మనలను కాపాడుతూనే ఉన్నారు. బాబాకు ఎలా దగ్గరగా, ఏం చేయటం వలన దగ్గరవుతామో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ తన పుస్తకాల ద్వారా మనకు బాబాను గూర్చి తెలియజేసారు.

 మనిషి నడవడికి దారి చూపించే యోగి .మార్గదర్శి బాబా. బాబా భౌతికంగా 1918లో దూరమైనా… ఆయన సమాధిని దర్శించుకుని భక్తులు సంతృప్తి చెందుతుంటారు. బాబా చెప్పిన 10 మాటల ప్రకారం ‘ఆయన సమాధే భక్తులను దీవిస్తుంది. అక్కడి నుంచే దర్శనమిస్తారు, మాట్లాడతారు’. ఈ నమ్మకాన్ని ఎవరు అవునన్నా కాదన్నా భక్తులకు మాత్రం శిలాశాసనం.