ఈ విశాల విశ్వమంతా బాబా కరుణను పొందటానికి అర్హమైనదే. ఈ విషయమే సాయిబాబా అనేక సందర్భాలలో చూపారు. కావేవీ కవితకు అనర్హం అన్నట్లు, కారెవరూ కరుణకు అనర్హులు అనేది చాలా సార్లు నిరూపితమైన సత్యము. అలాంటి ఓ సంఘటన ..బాబా జీవితంలో జరిగింది చూద్దాము.

 షిర్డీలో బాబా నిత్యం తన మహిమలు,కరుణతో భక్తులను అక్కున చేర్చుకుంటన్న రోజులవి. ఎక్కడెక్కడి వారు బాబా దక్కరకు చేరేవారు. అలా ఠక్కర్ థరమ్సే జెఠాభాయి అనే హైకోర్టు ప్లీడరుకి ఒక కంపెనీ ఉండేది. దానిలో కాకా మేనేజరుగా పనిచేస్తూ ఉండేవారు. యజమానీ, మేనేజరు కలిమెలిసి స్నేహంగా ఉండేవారు. కాకా … షిరిడీకి అనేకసార్లు వెళ్ళటం, కొన్ని రోజులు అక్కడనుండి తిరిగి బాబా అనుమతి పొంది రావటం, మొదలైనవి ఠక్కరుకు తెలుసు. దాంతో ఆయనకు బాబా గురించి ఆసక్తి కలిగింది.  కుతూహలం కోసం బాబాను పరీక్షించే ఆసక్తితో, ఠక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కాకా ఎప్పుడు తిరిగి వస్తారో అనేది నిశ్చయంగా తెలియదు కాబట్టి ఠక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళారు. ముగ్గురు కలిసి బయల్దేరారు.

బాబాకి ఇవ్వస్డానికి కాకా రెండు శేర్ల ఎండుద్రాక్ష పండ్లు (గింజలతో ఉన్నవి) దారిలో కొన్నారు. వారు షిరిడీకి సరైన వేళకు చేరుకొని, బాబా దర్శనంకోసం మసీదుకు వెళ్ళారు. అప్పుడు అక్కడ బాబాసాహెబు తర్ఖడు ఉన్నారు. ఠక్కర్ మీరు ఎందుకు వచ్చారు అని తర్ఖడుని అడిగారు. దర్శనం కోసమని తర్ఖడు జవాబిచ్చారు. మహిమలు ఏమైనా జరిగాయా అని ఠక్కర్ ప్రశ్నించారు. బాబా దగ్గర ఏమైనా అద్భుతాలు చూడటం తన నైజం కాదనీ, భక్తులు ప్రేమతో కాంక్షించేది జరుగుతుందని తర్ఖడ్ చెప్పారు.

కాకా బాబా పాదాలకు నమస్కరించి ఎండుద్రాక్ష పళ్ళను అర్పించారు. బాబా వాటిని పంచిపెట్టమని ఆజ్ఞాపించారు. ఠక్కరుకు కొన్ని దాక్షలు దొరికాయి. అతనికి అవి తినడానికి యిష్టం లేదు. ఎందుచేత అంటే తన వైద్యుడు కడిగి శుభ్రపరిచకుండా ద్రాక్షలు తినకూడదని సలహా యిచ్చిఉన్నాడు. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచింది. తనకు వాటిని తినడం ఇష్టం లేదు కాని బాబా తినడానికి ఆజ్ఞాపించటంతో పారేయలేక పోయాడు. పారేసినట్లయితే బాగుడదని వాటిని నోటిలో వేసుకున్నారు. గింజలని ఏమి చేయాలో తోచకుండా ఉంది. మసీదులో గింజలు ఉమ్మివేయడానికి జంకుతూ ఉన్నాడు. తన యిస్టానికి వ్యతిరేకంగా చివరికి గింజలు తన జేబులో వేసుకున్నారు.

బాబా యోగి అయినట్లయితే తనకు ద్రాక్షపండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాటిని ఎందుకు బలవంతంగా ఇచ్చారు? ఈ ఆలోచన అతని మనస్సులో తట్టగానే బాబా యింకా మరికొన్ని ద్రాక్షపళ్ళు ఇచ్చారు. అతడు వాటిని తినలేదు, చేతిలో పట్టుకున్నారు. బాబా వాటిని తినమని అన్నారు. వారి ఆజ్ఞానుసారం తినగా, వాటిలో గింజలు లేకుండా ఉన్నాయి. అందుకు అతడు అమితంగా ఆశ్చర్యపడ్డాడు. అద్భుతాలు చూడలేదనుకున్నాడు. కాబట్టి అతనిపై ఈ అద్భుతం ప్రయోగించబడింది.

బాబా తన మనస్సుని కనిపెట్టి గింజలుగల ద్రాక్షపళ్ళను గింజలు లేనివాటిగా మార్చివేశారు. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించడానికి తర్ఖడుకు ఎలాంటి ద్రాక్షలు దొరికాయని అడిగారు. గింజలతో ఉన్నవి దొరికాయని తర్ఖడు చెప్పారు. ఠక్కరు ఆశ్చర్యపడ్డారు. తనలో ఉద్భవిస్తున్ననమ్మకం ధృడపరచడానికి బాబా యథార్థంగా యోగి అయినట్లయితే ద్రాక్షపళ్ళు మొట్టమొదట తాకి ఇవ్వాలి అనుకున్నారు. అతని మనస్సులో ఉన్న ఈ సంగతి కూడా గ్రహించి, బాబా కాకా దగ్గర ఎండుద్రాక్షల పంపిణీ ప్రారంభించాలని ఆజ్ఞాపించారు. ఈ నిదర్శనంతో ఠక్కరు సంతృప్తి చెందారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై