ఈ రోజు నుండి అనగా 22 ఫిబ్రవరి 2022 నుండి  4 మార్చి 2022 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగటానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి.  శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ రోజు  అంకురార్పణ జరుగుతుంది. ఈ రోజే ధ్వజారోహణం చేస్తారు.

రెండో రోజు నుంచి వరుసగా భృంగివాహనం , హంసవాహనం , మయూరవాహనం , రావణవాహనం , పుష్పపల్లకీ వాహనం , గజవాహన సేవలుంటాయి.

మార్చి 1 వతేదీ మహాశివరాత్రి నాడు ప్రభోత్సవం , నందివాహనసేవ , లింగోద్భవకాల మహారుద్రాభిషేకం , పాగాలంకరణ , కల్యాణోత్సవం జరుగుతాయి. మరునాడు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మార్చి 6వ తేదీనాడు మహాపూర్ణాహుతి నిర్వహించి ధ్వజావరోహణం కావిస్తారు.

 ఆరోజునే అశ్వ వాహనం , పుష్పోత్సవం , శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ ఉత్సవాల్లో స్వామివారు వివిధ వాహనాలను అధిరోహించి , తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులపై కరుణాకటాక్షాలను ప్రసరింపజేస్తారు. మహాశివరాత్రి నాడు స్వామి వారికి ప్రభోత్సవం , నందివాహన సేవలతో పాటు అనేక విశేష కార్యక్రమాలను నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవ వేడుకలు సందర్బంగా సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్ల‌తో ఆలయ ముఖద్వారం నుండి ఆలయ ప్రవేశం చేస్తారు. అనంతరం యాగశాల ప్రవేశం చేసి, గణపతిపూజ, మండపారాధన తదితర పూజాకార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. లోక కళ్యాణం కోసం శివసంకల్పాన్ని పఠించిన వేదపండితులు అతివృష్టి, అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఋత్వికులు సంకల్పాన్ని పఠిస్తారు.

ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని తొలుత గణపతి పూజ, చండీశ్వర పూజ, కంకణ పూజ, కంకణ ధారణ, ఋత్విగ్వరణం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం, ప్రధాన కళశ స్థాపన కార్యక్రమాలను నిర్వ‌హిస్తారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి నవ ధాన్యాలను అంకురారోపింప‌జేసే క్రతువును ఘనంగా చేస్తారు. ఆ తరువాత ధ్వజారోహణలో భాగంగా నూతన వస్త్రంపై పరమశివుని వాహనమైన నందీశ్వరుని ప్రతిమ, అష్టమంగళాలను చిత్రించిన నంది ధ్వజపటాన్నిధ్వజస్తంభంపై పతాకావిష్కరణ గావిస్తారు. చండీశ్వరస్వామి సమక్షంలో ప్రత్యేక పూజాధికాలు చేస్తారు.

శైవక్షేత్రాల్లో శ్రీశైలం తలమానికం. ఆదిమధ్యాంత రహితుడైన పరబ్రహ్మకు పవిత్ర చిహ్నంగా ఇక్కడ మల్లికార్జున మహాలింగ చక్రవర్తి కొలువై ఉన్నాడు. పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండోది ఈ క్షేత్రమే. శ్రీ భ్రమరాంబాదేవికి నెలవైన శక్తిపీఠం కూడా ఇదే. కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. సకల వేదాలకూ మూలాధారం. అటు జ్యోతిర్లింగం , ఇటు శక్తి పీఠం ఒకే గిరిశృంగం మీద వెలసిన తావు ఇది.