అనంతమైన ఈ కాలాన్ని లెక్కించటంలో ఉగాది (సంవత్సరాది) విశిష్టమైనది. మన కాలగణనకు ప్రతీక పంచాగము. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగ జరుపు కుంటాము. ఏదో పండగ వచ్చింది కాబట్టి..జరుపుకుంటున్నాము అనుకోకుండా ..ఈ రోజు విశిష్టత తెలుసుకుంటే మరింత ఉత్సాహంగా జరుపుకోగలుగుతాము. ఈ సందర్బంగా ఈ పండుగ గురించి కొన్ని విశేషాలు.
వసంతకాలంలో చైత్ర శుక్ల పాడ్యమి నాడు నూతన సంవత్సరాది. ఈ సంప్రదాయం కన్నడ, మహారాష్ట్రులకు కూడ ఉంది. వింధ్య పర్వతాలకు దక్షిణాన శాలివాహన శకం ఉత్తరాన విక్రమార్క శకము పాటిస్తారు. ఇందుకు ఓ ఆసక్తికరమైన కథ ఉంది.ఇది మహారాష్ట్రలో ప్రచారంలో ఉంది.
పురంధరపురంలో ఓ ధనవంతుడైన వర్తకుడు తాను చనిపోయేముందు తన నలుగురు కుమారులకు సీళ్ళు వేసిన డబ్బాలను ఇచ్చి ఆ ప్రకారం పిల్లలు ఆస్తులు పంచుకోవాలని సూచించాడు. ఆ పాత్రలలో ఒక దానిలో మట్టి, మరొక దానిలో బొగ్గులు, ఇంకోదానిలో ఎముకలు, చివరి డబ్బాలో తవుడు ఉన్నాయి. దీని భావం తెలియక సోదరులు నలుగురు విక్రమార్క చక్రవర్తి వద్దకు పరిష్కారం కోసం వెళ్ళారు. కాని విక్రమార్కునికి దాని అంతరార్ధం అంతుబట్టలేదు. ఆ సోదరులు పరిష్కారం కోసం ప్రతిష్ఠానపురం వెళ్ళారు. ఎవ్వరూ పరిష్కారం చెప్పలేకపోయారు. కాని ప్రతిష్ఠానపురం లోని ఓ బాలుడు ఆ చిక్కుముడిని విడదీసాడు.
ఆ బాలుడు వారి సమస్యను విని మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపనూ, ఎముకలతో నిండిన పాత్ర కలిగిన కుమారుడు ఏనుగులు, గుఱ్ఱాలు మొదలైన జంతువులను, తవుడు తో నిండిన పాత్రను పొందిన కుమారుడు ధాన్యాలనూ పంచుకోవాలని వర్తకుని తాత్పర్యమని చెప్పాడు. ఆ బాలుని పేరే శాలివాహనుడు .
శాలివాహనుని సంగతి విన్న విక్రమార్కుడు ఆ బాలుడిని చూడాలని కుతూహలపడి కబురు చేశాడు. అందుకు శాలివాహనుడు తిరస్కరించి విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందన్నాడు. విక్రమార్కుడు కోపించి శాలివాహనునిపై సమరానికి వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి తన మంత్రశక్తితో వాటికి జీవం పోసి విక్రమార్క చక్రవర్తి సేనలను సమ్మోహనాస్త్రంతో నిదురపోయేటట్లు చేశాడు.
అప్పుడు ఆకాశవాణి ఆ ఇద్దరినీ ఉద్దేశించి నర్మదానదీ ఉత్తరాన విక్రమార్కుని, దక్షిణాదిని శాలివాసనునీ రాజ్యం చేయమని ఆజ్ఞాపించింది. ఆ విధంగా చైత్ర శుక్ల పాడ్యమి నాడు శాలివాహనుడు తన రాజ్య పట్టాభిషక్తుడయ్యాడు. శాలివాహన శకారంభకుడు అయ్యాడు. ఆ రోజు యుగాది అయ్యింది.
ఆదిలో ఈనాడే బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించాడు. ఈ కారణంగానే ఉగాది నాడు కొత్త లెక్కలు ప్రారంభించే ఆచారం వచ్చింది. వనవాసానంతరం సీతారాములు అయోధ్యకు ఈనాడే తిరిగి వచ్చారు. వసుమహారాజు తపస్సు చేసి ఈనాడే రాజ్యాధికారం సాధించాడు. అందుకే ఉగాదికి అంత ప్రాశస్థ్యం.
ఉగాది అనగా ఉగస్య -ఆది “ఉగ” అనగా నక్షత్ర గమనము – జన్మ – ఆయుష్షు అని అర్థం. ‘ఆది’ అనగా మొదలు. కావున ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజుగా ఉగాది కి పేరు. యుగము అనగా రెండు లేక జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది.ఈ రోజుకి వసంత కాలమునకు ఎంతో అవినాభావ సంబంధము ఉంది. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణ,ఇతిహాసాలు చెబుతున్నాయి.