మోదేవ్యై సుబద్రాయై కన్యకాయై నమోనమః…శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమోనమః
జయాయై చంద్రరూపాయై చందికాయై నమోనమః…శాంతిమావాహనోదేవీ వాసవ్యైతే నమోనమః

స్త్రీలోని ఆత్మీయతకు,అనురాగానికి, సౌమ్యానికి, త్యాగగుణానికి, పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం ‘వాసవీ కన్యకా పరమేశ్వరి’ని చెప్తారు.ఈ రోజు శ్రీ వాసవి జయంతి..ఈ సందర్బంగా ఆమె గురించి మరో సారి గుర్తు చేసుకుందాం. ఒక కన్యగా ఆమె  అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలసిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం.

మన  పురాణాగాథ ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్రామంలో కుసుమ శ్రేష్టి, కౌసుంబి అనే వైశ్య దంపుతులుండేవారు. వీరికి వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు. అందుకని కుసుశ్రేష్టి ఓ యాగం చేశారు. ఆ యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి, రెండు ఫలములను ప్రసాధించి కౌసుంబిని తినమని చెప్పటం జరిగింది. ఆ ఫలం భుజించిన తర్వాత ఆ దంపతులకు వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరుపాక్షుడు అని అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేసారు. వాసవీ ఎంతో  సుగుణవంతురాలు,  సౌదర్యవతి. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయి గా పేరు తెచ్చుకుంది.

Image Courtesy : Wikipedia

ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు (విమలాదిత్య మహారాజు) అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేది.  విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమశ్రేష్టి కుమార్తెను చూడటం జరిగింది. వెంటనే మోహితుడై  వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకు వెళ్ళి కుసుమశ్రేష్టిని కలిసి, వాసవిని పెళ్ళి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్థనుడు

విష్ణువర్ధుని కోరిక కుశమశ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. విష్ణువర్ధనుడు క్షత్రియుడు. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడికి లోనయ్యాడు. అయితే వైశ్యకుటుంబంలో జన్మించిన వాసవికి , క్షత్రియ కులానికి చెందిన రాజుతో వివాహాన్ని నిరాకరించాడు ఆ కుసుమశ్రేష్టి. దాంతో వివాహం సమ్మతం కాదని తెలుపగా ఒక నెల రోజుల వ్యవది నిచ్చి మనస్సు మార్చుకోక పోతే సైన్యంతో యుద్ధం చేసి వాసవిని తీసుకొని పోతానన్నాడు.  ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికైనా వెనుకాడనని మళ్లీ రాయబారానికి మంత్రిని పంపాడు.

 అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు, పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు.ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమశ్రేష్టి తమ గురువు భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది, కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా, మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం విష్ణువర్ధునుడితో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.

Image Courtesy : Wikipedia

భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ మాటలు కుశుమశ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పని చేసాయి. తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని విష్ణువర్ధునుడికి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయ రాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటనతో వైశ్యుల మధ్య ఐకమత్యం దెబ్బతింది. విష్ణువర్ధనుడు దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి, తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుశుమశ్రేష్టికి అండగా నిలిచారు.   అంతలోనే సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకుని పోయి వివాహానికి సిద్దమయ్యేడు విష్ణువర్థనుడు.

 నాటి సమావేశం లో మొదటిసారిగా వాసవాంబిక తన ప్రతిస్పందనను సభాపూర్వకంగా తెలియజేసెను. వాసవి అందరిని ఉద్దేశించి – ”నేను వివా హానికి నిరాకరించినట్లయితే విష్ణువర్ధనుడు సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాడు . యుద్ధం వల్ల ఎంతోమంది సైన్యం నశిస్తారు. అపార జననష్టం, ధననష్టం జరుగుతుంది. ఎంతోమంది పునిస్త్రిలు వైధవ్యంతో బాధ పడతారు. తన వల్ల ఇంత రక్తపాతం జరుగకూడదు.ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్ధం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం . దృడ సంకల్పం, పట్టుదల ఉన్న వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు”. వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడి నడవడానికి నిర్ణయించుకున్నారు.

వాసవి సూచనలను అనుసరించి, ఒకానొక మాఘ శుద్ధ పాడ్యమి రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్పూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. వారు వాసవీ కన్యకాంబ ని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు.

దానికి ఆమె ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది.

 వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసింది. అందరు అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండం లోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. “ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను, నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టీశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయినవారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోనికి ప్రవేశించాడు. వాసవి అగ్నిప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై, రాజును తన ఖడ్గంతో సంహరించింది.

 విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజనరేంద్రుడు క్రుంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్ధించాడు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు. వాసవాంబిక ఆత్మార్పణ జరిగిన తరువాత పెనుగొండను అనేక మంది క్షత్రియ రాజులు పరిపాలించారు. వారందరూ వారి రాజకోటను పెనుగొండ ఊరి అవతలే కట్టుకున్నారు. ఏ ఒక్కరాజు పెనుగొండ లోపల ఉండి పాలించడానికి సాహసించలేదు.

 కమలాయై నమస్తేస్తు విష్ణునేత్ర కులాలయే…మృడాన్యై నమస్తేస్తు వాసవ్యైతే నమోనమః
నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరి…శ్రియంనోదేహి మాతస్త్వం వాసవ్యైతే నమోనమః