తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి శెలవులు,వరస శెలవులు,వీకెండ్ కలిసిరావటంతో  పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.  కోవిడ్ అనంతరం కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ నెల 11వ తేది నుంచి 17వ తేది వరకు భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. 7 రోజులలో 5.30 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 24.38 లక్షల లడ్డూలు విక్రయిస్తే….హుండీ ద్వారా రూ.32.5 కోట్లు ఆదాయం లభించిందని తెలిపారు. 46 వేల 419 వాహనాలలో భక్తులు తిరుమలకు తరలివచ్చారన్నారు. మే 1వ తేది నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతిస్తాం అన్నారు.

Image Courtesy : Wikipedia

 గత ఏడాది వర్షాల కారణంగా శ్రీవారిమెట్టు మార్గం ధ్వంసం అయింది. ఈ మార్గంలో మరమ్మతుపనులు చేపడుతోంది టీటీడీ. వీఐపీ బ్రేక్ దర్శనాలను ఇవాళ నుంచి పునరుద్ధరిస్తున్నాం అన్నారు ధర్మారెడ్డి. మరోవైపు స్లాట్ దర్శనాలు తిరిగి ప్రారంభించే యోచనలో టీటీడీ వున్నట్టు తెలుస్తోంది.

గత కొంతకాలంగా స్లాట్ దర్శనాలు లేవు. దీంతో భక్తులు వీటి కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి నిత్యం 20 వేల మంది వరకు సర్వదర్శన టోకెన్లు జారీచేయాలని నిర్ణయం తీసుకోనుంది. దర్శన టోకెన్లు లేని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతించాలని భావిస్తోంది టీటీడీ. ఈ నిర్ణయం కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి వుండే భక్తులకు దర్శన సమయం పెరగనుంది. ముందస్తుగా ప్లాన్ చేసుకుని రావాలని సూచించింది.

భక్తులు ఈ రద్దీని గమనించి ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని తిరుపతికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడవద్దని కోరింది.

కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో ఇటీవల టీటీడీ నిబంధనలు సడలించింది. దీంతో సర్వదర్వనం టోకెన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ రోజు టికెట్లు పొందిన భక్తులకు మూడు లేదా నాలుగు రోజుల తరువాత దర్శనానికి సమయం వస్తోంది. ఇందుకు అనుగుణంగా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులు ప్లాన్ చేసుకోని రావాలని టీటీడీ కోరుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని టీటీడీ సూచిస్తోంది.