అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర  అత్యంత ఘనంగా ,  వైభవంగా ప్రారంభమైంది. సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదాల కోసం ఎక్కడెక్కడ జనం మేడారానికి క్యూ కడుతున్నారు. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బెల్లాన్ని(బంగారం) కానుకగా సమర్పిస్తున్నారు. ఉదయం నుంచే గుడిసెలు ఏర్పాటు చేసి ముంగిళ్ల వద్ద రంగవల్లులతో అందంగా అలంకరించారు. అమ్మవార్లకు బెల్లం చీరెసారెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవతలను దర్శించుకొని తన్మయత్వానికి లోనవుతున్నారు.

జాతరలో రెండో రోజు అంటే ఈ రోజు  చిలుకుల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దె మీద ప్రతిష్టిస్తారు. ములుగు జిల్లా ఎస్పీ గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనంతో అమ్మకు స్వాగతం పలుకుతారు. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు ముగ్గులు వేస్తారు. ఆ సమయంలో భక్తులు డప్పు చప్పుళ్లతో పూనకాలతో ఊగిపోతారు.

మేడారం మహా జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులను తాకేందుకు.. అమ్మకు స్వాగతం పలికేందుకు దారిపొడవునా.. ఇసుకేస్తే రాలనంతగా భక్తులుంటారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుదీరి భక్తులను దర్శనమిస్తారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమలు , చీర , సారె, నూనె కలిపిన ఒడిబియ్యం, బంగారంగా పిలుచుకొనే బెల్లాన్ని సమర్పిస్తారు. నాలుగోరోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలందరినీ తిరిగి అడవికి తీసుకెళ్తారు పూజారులు.  

సమ్మక్క, సారలమ్మ గద్దెల దగ్గర వంశ పారంపర్యంగా గిరిజనులే పూజార్లుగా కొనసాగుతున్నారు.  తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం(బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజనుల ఆరాధ్య దైవమైనా.. మిగతా జనాలు కూడా అమ్మవార్లను దర్శించుకుంటారు. ప్రతిసారి సుమారు కోటి మందికి పైగా ఈ మహా జాతరకు వస్తారు. అందుకే ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా పేరుగాంచింది.