తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్ లో శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. ఈ కళ్యాణం ఏర్పాట్లను టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. ఈ నేపధ్యంలో తిరుపతి దేవస్దానం వారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కే.స్టాలిన్ కు ఉత్తరం రాసారు. శ్రీనివాస కళ్యాణం ఏ ఇబ్బందులు లేకుండా జరిగేలా సపోర్ట్ ఇవ్వమని కోరారు. అలాగే స్టాలిన్ ను కుటుంబ సమేతంగా వచ్చి శ్రీవారిని దర్శించుకోమని కోరారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ స్దాయిలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. చెన్నై కార్పోరేషన్, ఉద్యోగులు తమకు సహకరించేలా చూడమని ముఖ్యమంత్రి స్టాలిన్ ని కోరటం జరిగిందని చెప్పారు.
ఈ సందర్భంగా ధర్నారెడ్డి మాట్లాడుతూ….చెన్నైలో శ్రీవారి కల్యాణం నిర్వహించేందుకు స్థానిక సలహా మండలి ఛైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి, ఇతర సభ్యులు ముందుకొచ్చారని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో శాంతిభద్రతలు, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం, చెన్నై కార్పొరేషన్ ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
శ్రీ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యారికేడింగ్, బ్యాక్ డ్రాప్ సెట్టింగ్ తదితర ఏర్పాట్లు జరుగుతాయన్నారు. టిటిడి నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేస్తామని, అర్చకులు, వేద పండితులు, అన్నమాచార్య కళాబృందం ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ కల్యాణంతో దేశవ్యాప్తంగా ధార్మిక కార్యక్రమాలు తిరిగి ప్రారంభించినట్టు అవుతుందన్నారు. ఈ కళ్యాణంతో తమిళ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు లభిస్తాయన్నారు.
మరో ప్రక్క కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి దర్శన టికెట్లను క్రమంగా పెంచుతోంది. ఈ క్రమంలోనే భక్తులు భారీ సంఖ్యలో కలియుగ దైవం దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు. ఇవాళ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయడంతో పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం పోటెత్తారు. తిరుపతిలోని శ్రీనివాస, భూదేవి కాంప్లెక్స్ కౌంటర్ల వద్ద భారీ సంఖ్యలో క్యూ కట్టారు.
ఇవాళ సర్వదర్శనం టోకెన్లు పొందిన వారికి ఈ నెల 12లోపు దర్శన స్లాట్ లభిస్తుందని టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం విడుదల చేయాలనుకున్న సర్వదర్శన టోకెన్లను ఒకరోజు ముందే.. అంటే మంగళవారమే విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లను విడుదల చేయడం లేదని, భక్తులు సహకరించాలని కోరింది.