ప్రసిద్ధి పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ దేవి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలతో మెరిసిపోతోంది. గత రెండు రోజులుగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు పంచమి సందర్భంగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేసారు.

వివరాల్లోకి వెళితే…  నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలోని జ్ఞాన సరస్వతీ  ఆలయం వసంత పంచమి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 5న వసంత పంచమి కావడంతో  రెండు రోజుల ముందే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల ఉత్సవాల కోసం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు అధికారులు. తెల్లవారుజాము 3 గంటల నుంచే  భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ఈ రోజు  రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు బట్టలు సమర్పించనున్నారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందని భక్తుల నమ్మకం. ఉత్వాలలో భాగంగా మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అభిషేకం, పూర్ణాహుతి, మహావిద్యా హోమం, బలిదానం, గణపతి హోమం, చండీయాగం, కుంకుమార్చన వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇక ఈ ఉత్సవాలలో పాల్గొనటం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు  మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర భారతదేశం నుంచి భక్తులు పెద్ద ఎత్తున బాసరకు వచ్చారు. భక్తులు కరోనా వైరస్ బారిన పడకుండా భౌతిక  దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. మాస్కులు కంపల్సరీ చేశారు. గతంలో చిన్నపిల్లలకు క్యూలైన్లో పాలు, మంచినీళ్లు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేసేవారు. కరోనా నిబంధనల వల్ల ఈసారి వాటిని రద్దు చేశారు.

భక్తులు ఇబ్బందిపడకుండా మండపాలు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అవాంచనీయ సంఘటనలు  జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి ముందు తెల్లవారుజామునే గోదావరిలో స్నానం చేస్తుంటారు భక్తులు. దీంతో ముందు జాగ్రత్తగా నది దగ్గర గజ ఈతగాళ్లను రెడీగా ఉంచారు ఉంచారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.