స్వయంగా వెలసియున్న శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి దేవస్థానములో అయినవిల్లి ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ప్రాధాన్యంగా వెలుగుతోంది. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం కావటంతో ..కాణిపాకం తరువాత అంతటి  ప్రాశస్త్యం కలిగి ఉంది.  ఉమాసుతుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు.  ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవునికి, శివునికి, శ్రీఅన్నపూర్ణాదేవికి, శ్రీకాలభైరవస్వామికి ఉపాయాలు ఉన్నాయి.  ఈ వినాయకునికి నారికేళా వినాయకుడు అని కూడా అంటారు. ఒక్క కొబ్బరికాయ కొడితే, కోరిన కోర్కెలు తీర్చే నారికేళా గణనాథుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. స్వయంభువ వినాయక క్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది.

స్దల పురాణం:

కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం ద్వారా తెలుస్తోంది.  దక్ష ప్రజాపతి ద్రాక్షరామంలో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకున్ని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి.   వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు అని చెపుతుంటారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.

అలాగే అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది. ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడనీ తరువాతి కాలంలో వారే మూగ, చెవిటి,గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థలపురాణం వివరిస్తుంది.

ఎలా వెళ్లాలి

  తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ  దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది.

ప్రత్యేక హోమం
ఈతి బాధల నివారణార్దం ప్రతీరోజు శ్రీ స్వామి వారికి శ్రీలక్ష్మీగణపతి హోమము శైవాగమోక్త ప్రకారము నిర్వహించబడుచున్నది.  ఈ హోమము చేయించుకొనుట వలన ఫలితములు: వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ, వ్యావహారిక కార్యక్రమములు యందు సర్వత్రా జయం, నవగ్రహశాంతి, సర్వజనులు సుఖ సంతోషములతో ఉంటారు.

 వివిధ ఉత్సవాలు..

మార్చి నెలలో స్వామివారికి లక్ష పెన్నులతో పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా సప్తనది జలాల అభిషేకం చేసి తరువాత లక్ష పెన్నులతో పూజా నిర్వహిచి ఆ పెన్నులను చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఈ పెన్నులు తీసుకునేందుకు సుదూర ప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చి మరీ పెన్నులు తీసుకెళ్తారు.

ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్‌ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.  

 భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.  మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు.

విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష కలములను సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి… లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం.

ఓం గం గణపతయే నమః