ఈ కలియుగంలో చాలా తొందరగా కరిగి,సహాయానికి వచ్చే దేవుడుగా ఆంజనేయస్వామికి మారు పేరు…ఆయనను ప్రసన్నం చేసుకోడానికి ఉన్న మార్గాలలో శ్రీ తులసీదాస్ విరచిత “హనుమాన్ చాలీసా”అనే 40 పద్యాల ప్రార్థన మొదటిది,సులభమైనదని చెప్తారు. తులసి దాసుకు హనుమంతుని దర్శనము జరిగిన తరువాత ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని చెప్తారు.
ఈతిబాధలు, గ్రహబాధలు ఉన్నవారు కనీసం 21 రోజులు ప్రతిరోజు ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షిణలు, సింధూర ధారణ చేస్తే తప్పక అన్ని బాధలు పోతాయి. ఇక వివాహం కానివారు, ఉద్యోగాలు రానివారు మండలం లేదా అర్ధమండలం హనుమాన్ చాలీసా పారాయణం, ఆంజనేయస్వామి దేవాలయంలో 21 ప్రదక్షిణలు, ఉపవాస నియమాలు పాటిస్తే తప్పక ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి.
హనుమను పుజించువారు సమస్త దేవతలను పూజించిన ఫలమును పొందెదరని పురాణోక్తం. వారికీ భోగ మోక్షములు నిలిచి యుండును. రోజుకు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా నలభై రోజులు పారాయణ చేసిన వారికీ హనుమ అనుగ్రహముతో, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష నివారణ మొదలగునవి నిశ్చయముగా ప్రాప్తించును.
హిందీభాష లో,ఉత్తర భారతంలో ఈ హనుమాన్ చాలీసా(శ్రీ తులసీదాస్ తర్వాత) శ్రీ ఎం.స్.రామారావు గారిది మొదటగా చెప్పుకోవాలి.. ఆయన తేటతెలుగులో “శ్రీ హనుమాను గురుదేవులు” అంటూ మొదలెట్టి రాసి,పాడిన ..చాలీసా,సుందరకాండ విననివారుండరు. ఆయనకు ఆంజనేయస్వామి మీద వున్న భక్తి ఈ రెంటిలో మనకు కనపడుతుంది..దానివల్లనే శ్రీ హనుమ ఆయన్ను దారిద్ర్యం నుంచి ,కష్టాలనుంచి రక్షించారు అని చెప్పుకుంటారు..వాటిలో ఉన్న పదాలు చాలా సులభంగా, మనసును ఆహ్లాదపరిచి హాయినిస్తాయి. ఆయన భక్తికి మెచ్చి శ్రీ హనుమే ఆయనతో ఇది రాయింపచేశాడని అంటారు..అందుకే శ్రీ తులసీదాసు రచనలాగా అజరామరమై మనను రక్షిస్తున్నాయి. అప్పట్లో డబ్బైలలో ఆల్ ఇండియా రేడియో,హైదరాబాద్ లో ఉదయం “భక్తిరంజని”లో రోజూ వచ్చేది.
“యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిమ్ నమత రాక్షసాంతకం”
హనుమ ఎక్కడ ఉంటే అక్కడ ధైర్యం , సాహసం, బలం, భక్తి, సంకల్ప శక్తి, వినయం, విధేయతలు ఇవన్ని మనలో కూడా ప్రస్పుటం అవుతాయి
జై హనుమాన్ !! జై జై హనుమాన్!!!!