హిందూ శాస్త్రాలలో శివ పురాణానికి అత్యున్నత స్థానముంది.  ఈ  శివ పురాణం చదవడం వల్ల త్వరితగతిన పాప విముక్తులు అవుతారు. దాంతో పాటు సకల ఐశ్వర్యవంతులుగా మారుతారని శివ పురాణం చెబుతోంది. అంతే కాదు శివ పురాణాన్ని అనుసరించడం వల్ల లేదా వినడం వల్ల పారాయణ చేయడం వల్ల శివానుగ్రహం తప్పకుండా ఉంటుంది. శివ ఆరాధనకు మించిన తరుణోపాయం ఏమి లేదని, పాపాలు పోగొట్టుకోవడానికి ఇదే మంచి మార్గమని సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే స్వయంగా చెప్పారు.

పరమ శివుడు తెలిపిన శివమహాపురాణం పన్నెండు సంహితలు కలిగి ఉన్నదని, ఐదు సంహితలు ఇప్పుడు లభ్యం కావటం లేదనీ తెలియవస్తున్నది. అవి వినాయక, మాతృ, ఏకాదశ రుద్ర, సహస్ర కోటి రుద్ర, ధర్మ సంహితలు.

శివపురాణం గురించి సద్గురు ఏమంటారంటే.. “శివ” అని సూచించబడుతున్న అనంతమైన ఈ శూన్యం, పరిమితిలేని నిరాకార స్వరూపం… దానికి మొదలూ, చివరా లేవు, అది శాశ్వతమైనది. అయితే మనిషి అవగాహన, రూపానికి పరిమితమైపోయింది కాబట్టి, మన సంస్కృతిలో, సంప్రదాయాల్లో ఈ “శివ”త్వానికి ఎన్నో అద్భుతమైన స్వరూపాలను సృష్టించుకున్నాం. నిగూఢమూ, అగోచరమూ అయిన ఈశ్వరునిగా, మంగళకరుడైన ‘శంభు’నిగా, అమాయకత్వం తో మనల్ని నిర్వీర్యులనిచేసే’భోళా శంకరునిగా’, సకల వేదాలూ, శాస్త్రాలూ, తంత్రాలూ బోధించిన గొప్ప గురువు ‘దక్షిణామూర్తి’గా, ఎవరినైనా ఇట్టే క్షమించేసే ‘ఆశుతోషు’ని గా, ఆ సృష్టికర్త రక్తాన్నే శరీరానికి అలముకున్న ‘కాలభైరవుని’గా, ప్రశాంతతకు ప్రతిరూపమైన ‘అచలేశ్వరుని’గా, బ్రహ్మాండ నృత్యకారుడైన ‘నటరాజు’గా, ఇలా ఈ జీవితానికి ఎన్నెన్ని పార్శ్వాలుండగలవో అవన్నీ కూడా ఆయనకి ఆపాదింపబడ్డాయి అని,

ఇక మంచి భార్య కావాలన్నా, యోగ్యుడైన భర్త కావాలన్నా , మంచి సంతానం కావాలన్నా, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, మోక్షం పొందాలనుకున్న శివుడిని ఆరాధించడమే మంచి మార్గమని విష్ణువు బ్రహ్మకు ఉపదేశించారు. కాబట్టి కలియుగంలో మనం కూడా ఈ పురాణాన్ని చదవడం చేస్తే అనుకున్న కార్యాల్లో విజయంతో పాటు పాపవిముక్తులమై.. మోక్ష మార్గాన్ని ఎంచుకున్నట్లవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

‘‘శంకరస్య చరితామృత శ్రవణం, చంద్రశేఖర
గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం,
సంభవంతు మమ జన్మని, జన్మని
‘‘సర్వం పరమేశ్వరార్పణమస్తు’’