శ్లో : శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !!

విళంబి నామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమినాడు, పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో జన్మించాడు శ్రీరాముడు. పాంచరాత్రాగమ సంప్రదాయం ప్రకారం ఆయన అవతరించిన రోజే కల్యాణాన్ని ఆచరించాలనే నియమం ఉంది. ఆ ప్రకారం చైత్రశుద్ధ నవమినాడే సీతారాముల కల్యాణం జరిపించడం అనాదిగా వస్తోంది. అదే శ్రీరామనవమి. ఈ పండుగను తలచుకోగానే స్ఫురించేది భద్రాద్రే. అత్యంత వైభవంగా జరిగే ఆ లోకకల్యాణాన్నీ ఆ మర్నాడు జరిగే పట్టాభిషేక మహోత్సవాన్నీ చూడ్డానికి ఏటా లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ శ్రీరామ నవమి నాడు ఆచరించ వలసినవి ఏమున్నాయో చూద్దాం.
రామనవమి పర్వదినాన ప్రతి ఒక్కరినీ కొన్ని పనులు చేయమంటుంది శాస్త్రం.

1 . సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తల స్నానం చేసి, ఇంట్లో సీతారాముల వారిని భక్తి, శ్రద్ధలతో పూజించాలి.
2. వడపప్పు, పానకం, పాయసంలాంటి పదార్థాలతో రాముడికి నివేదన చేసి అందరికీ పంచి పెట్టాలి.
3. రోజంతా శ్రీరామ నామం స్మరిస్తూ ఉండటం.
4. శక్తి కొలదీ దానధర్మాలు చేయాలి. ఎందుకంటే రామనవమి తిథి లాంటి మహా పర్వదినం నాడు చేసే ఏ పుణ్యకర్మయినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
5. రామనవమి నాడు పగలు ఉపవాసం, రాత్రికి జాగరణ చెయ్యమంటారు పెద్దలు. కాబట్టి ఆరోగ్యం సహకరించినంత వరకు పాలు, పండ్లు లాంటి సాత్వికమైన ఆహారం తీసుకుని రామనామాన్ని స్మరిస్తూ, వీలయితే రాత్రికి జాగరణ చెయ్యడం మంచిది.
6. దగ్గర్లోని రామాలయానికి వెళ్లి, భగవద్దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉంటే సీతారాములవారి కల్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించడం.. లేదా టీవీలలో చూపించే ప్రత్యక్ష ప్రసారాలను అయినా భక్తి భావంతో చూడాలి.
7. వీలయితే రామాయణ పారాయణం లేదా శ్రవణం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.

అందరూ భక్తిశ్రద్ధలతో రామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలని, రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరి మీదా ప్రసరించాలని కోరుకుందాం.
శ్రీ రామ జయ రామ జయ జయ రామ!