అర్జునుడి అభ్యున్నతికి నారాయణుడు బోధించిన జీవనసారం గీతగా చెప్పబడుతోంది. ఇక్కడ నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు. నరుడు.. ఆ రోజు ఒక్క అర్జునుడే! మనిషినీ మహోన్నతుడిగా తీర్చిదిద్దడానికి శ్రీకృష్ణుడు పూరించిన శంఖారావం గా మన పెద్దలు చెప్తూంటారు. సంగ్రామ సమయంలో ఆవిర్భవించిన భగవానుడి గీత.. ఈనాటికీ జీవన సంగ్రామంలో పోరాడుతున్న అభినవ అర్జునులకు కర్తవ్య బోధ. అయితే ఈ భగవద్గీత ని అర్జునుడి కంటే ముందు ఎవరు విన్నారు…?

ఇదేమిటి అర్జునుడికే కదా చెప్పింది. ఆయన కన్నా ముందు ఎవరు వింటారు అంటారా… పురాణాల ప్రకారం అర్జునిడికన్నా ముందే భగవద్గీత గురించి సూర్య భగవానుడికి తెలుసు. ఎలా తెలుసని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగగా, నీకు, నాకు కంటే కూడా ముందు చాలా జన్మలు జరిగాయని అన్నాడు. ఆ జననాల గురించి నీకు తెలియదని, నాకు తెలుసని బదులిచ్చాడు. ఈ ప్రస్తావన జ్ఞాన యోగము, భగవద్గీతలో నాలుగవ అధ్యాయము లో వస్తుంది.
భగవంతుడు…ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు, మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు. కాని కాలక్రమంలో ఇది మరుగున పడిపోయింది అన్నారు. అర్జునుడు సందేహంతో “సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు. మరి మనము ఇప్పటి వాళ్లము. నివు చెప్పినది ఎలా సాధ్యము?” అన్నాడు. కృష్ణుడు “నీకు, నాకు ఎన్నో జన్మలు గడిచాయి. అవన్నీ నాకు తెలుసు. నీకు తెలియదు. నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకు నేనే జన్మిస్తుంటాను. ధర్మహాని-అధర్మవృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు ప్రతి యుగంలోను నేను అవతరిస్తాను అని వివరించి చెప్పారు.

అలా అంతకు ముందు భగవద్గీతను సూర్య భగవానుడుకి తెలియటం జరిగింది అన్నారు. ఆ తరువాత భగవద్గీత గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది. ఈయనకి వేదవ్యాసుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఆ దివ్యదృష్టి సాయంతో గీతా బోధనను దృతరాష్ట్రుడికి వినిపించాడు.
ఆ తరువాత మహాభారతాన్ని రచించిన శ్రీ వేద వ్యాసుడు శ్రీ గణేశుడికి గీతాబోధన చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా వేద వ్యాసుడు తన శిష్యులైనటువంటి వైసంపాయనుడు, జైమిని, పాలసంహితుడికి మహాభారతంలో లోతైన రహస్యాలను ఉపదేశించాడు. ఈ విధంగా మహాభారతాన్ని తన శిష్యులకు చెప్పాడు. ఈ గ్రంథంలోని ముఖ్యమైన ఘట్టాలను వారికీ ఉపదేశించాడు. దీని వలన భగవద్గీత గురించి సకల జనులు తెలుసుకోగలిగారు. వ్యాసుడు శిష్యుడు వైషాంయపనుడు జనమేజయుడికి మహాభారతం గురించి వివరించాడు. ఆ సమయంలోనే ఆయనకు భగవద్గీతను బోధించాడు. ఈ విధంగా అర్జునుడికన్నా ముందు భగవద్గీతను చాలా మంది తెలుసుకున్నారు.