ఈ శతకం చాలా ప్రజాదరణ పొందినది. ఇది భక్తి రస ప్రధానమైనది. ఈ శతకంలో 102 కంద పద్యములలో కృష్ణలీలలు, దశావతారములను వర్ణించడం జరిగింది. సరళమైన భాషలో చిన్నపిల్లలలు కూడా అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. ఈ శతకము లోని మొదటి పద్యం :
శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంకీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యము తోడ మమ్ము గాపుము కృష్ణా!

భావం:-
ఓ శ్రీకృష్ణా! నువ్వు రుక్మిణీ దేవికి భర్తవు. పరమేశ్వరుడవు. నారద మహర్షి చేసే గానమునందు ఆసక్తి ఉన్నవాడివి. గోవర్థనమనే కొండను ఎత్తినవాడివి. ద్వారకానగరంలో నివసించినవాడవు. జనులు అనే రాక్షసులను చంపినవాడవు. ఇన్ని విధాలుగా గొప్పవాడివయిన నీవు మావంటి మానవులను దయతో రక్ష్మించుము.
శ్రీకృష్ణుని గురించిన సమాచారాన్ని కవి ఈ పద్యంలో ఎంతో అందంగా వివరించాడు. ఆయనను మనం ఎందుకు పూజించాలో తెలియచేయడానికి శ్రీకృష్ణుడిలో దైవలక్షణాలను కేవలం నాలుగు వాక్యాలలో ఎంతో సులువుగా తెలియచేశాడు. వేమన, సుమతీ శతకాల తరవాత అంతే తేలికగా ఉన్న శతకం శ్రీకృష్ణశతకం.

ప్రతిపదార్థం:-
శ్రీ అంటే లక్ష్మీదేవి అవతారంగా పుట్టిన; రుక్మిణి అంటే విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణీదేవికి; ఈశ అంటే భర్త అయినటువంటి వాడా; కేశవ అంటే పరమేశ్వరా; నారద అంటే నారదుడు అనే పేరుగల ఋషి ఆలపించే; సంగీత అంటే గానమునందు; లోల అంటే ఆసక్తి కలవాడా; నగ అంటే కొండను; ధరా అంటే ధరించినవాడా; శౌరీ అంటే ప్రతాపము కలవాడా; ద్వారక అంటే ద్వారక అను పేరు గల నగరంలో; నిలయ అంటే నివసించేవాడా; జనార్దన శిష్టులైన వారిని రక్షించువాడా; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా! కారుణ్యము తోడన్ అంటే దయతో; మమ్ము అంటే మమ్మల్ని అందరినీ; కావుము అంటే రక్షించుము.