మీరాబాయి, జనాబాయి పేర్లు వినని వారు ఎవరూ వుండరు అంటే అతిశయోక్తి  కాదు.

*రామాయణంలో శబరి, రామ భక్తులలో
కబీర్ దాస్, రామదాస్, ఎంతటి శ్లాఘనీయులో,
కృష్ణ గాథ లో రాధ, మీరాబాయి, జనాబాయి, నామదేవుడు అటువంటి పూజ్యనీయులే.*

Image Courtesy : Wikipedia

 జానాబాయికి బాల్యం నుండి పాండురంగడి సంకీర్తనం చెయ్యడం అలవాటు. నిరంతర పాండురంగడి  సంకీర్తనం వలన ఆమె హృదయం ఆ స్వామి నామంతో నిండిపోయింది. నడుస్తూ,తింటూ,, త్రాగుతూ, నిద్రపోతూ ఏపని చేస్తున్నా ఆమె నోటివెంట పాండురంగని నామం ధ్వనిస్తూనే వుండేది.  పాండురంగ భక్తుడైన నామదేవుడు ఇంట జానాబాయి పనిచేస్తూవుండేది. ఇంటి పనులన్నీ చేస్తూ, ఆనందముగా పాండురంగని అన్నివేళలా స్మరించుకుంటూ జీవనం సాగించేది.  

 భగవతాంకితంగా రోజులు ఇలా సాగుతున్న తరుణం లో,  ఒకసారి నామదేవుడి సందర్శనం కోసం, జ్ఞానదేవుడు, నివృత్తి నాథుడు,  కబీరు దాసు ఇతర భక్తులు నామదేవుడి ఇంటికి వచ్చారు.   ఆ భగవంతుని లీలలో భాగముగా  ఆ సమయం లో  నామదేవుడు ఇంట్లో లేడు. ఆమె ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె పొరుగామెతో పిడకల కోసం తగవులాడుతున్నది.

Image Courtesy : Wikipedia

 అయ్యో! అంత దూరంనుండి ఈ తగవులు వినటం కోసం వచ్చానా! అని కొంచెం బాధపడినా, ఆమె దగ్గరకు సమీపించి, అమ్మా! నీవు  పిడకలకోసమే కదా దెబ్బలాడు తున్నావు! అవి నీవే అని ఎలా చెప్పగలమ్మా. అని అడిగాడుట.

అప్పుడు జనాబాయి “భక్తశిఖామణులకు ప్రణామాలు! నేను పిడకలు చేసేటప్పుడు పాండురంగడి నామాన్ని మనసారా తలుచుకొని జపించాను. కనుక నేను చేసిన పిడకలని చెవి వద్ద పెట్టుకొని వినండి, అవి ఆ దేవదేవుని నామాన్ని ఆలపిస్తాయి” అని వినయంగా చెప్పింది.

ఆ పిల్ల మాటల్లో నిజం ఎంత వుందో తెలుసుకోవాలని కబీరు దాసు ఆమె ఇచ్చిన  పిడకలను చెవి వద్ద పెట్టుకున్నాడు. అమోఘం! ఆ పిడకలు ‘పాండురంగ పాండురంగ’ అంటూ గానం చేసాయి, జనాబాయి భక్తికి  ఆ భక్తులు విస్తుపోయారు.  కబీర్ ఆమె భక్తికి, దృఢత్వానికి జోహార్లు అర్పించాడు.

ఈ అనన్య భగవద్భక్తురాలైన జనాబాయికి, విశ్వ నియంతయైన భగవంతుడు ఆమెకు వశమయి అన్నిటా తోడునీడగా వున్నాడు. చదువు సంస్కారములేని స్త్రీ మహాజ్ఞానులకు గూడ ఆదర్శప్రాయమైన భక్త శ్రేష్ఠ అయింది. భక్తుల నిష్కల్మష భక్తికి భగవంతుడు ఎప్పుడూ దాసోహమే కదా.

ఎంత నిర్మలమైన .. నిష్కపటమైన భక్తి…