యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వ‌ర‌కు 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్దాంతానుసారముగా, భగవద్రామానుజ సాంప్రదాయ సిద్దముగా బ్రహ్మోత్సవములు నిర్వహించుటకు ఏర్పాట్లు చేసిన‌ట్లు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. 11న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవ నిర్వహిస్తారు. ఇక 12వ తేదీన స్వామివారి దివ్య విమానం రథోత్సవం జరగనుంది.

 స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, శ్రీ సుదర్శన నరసింహ హోమము ఆర్జిత సేవలు రద్దు చేశామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈఓ తెలిపారు.

మరో ప్రక్క పల్లో పైతాన్‌ డిజైనుతో ప్రత్యేకంగా రూపుదిద్దిన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టుచీరలు యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఎంపికయ్యాయి. అమ్మవారికి పట్టుచీరతో పాటు స్వామిని అలంకరించేందుకు పట్టుపంచెను ఇక్కడ నుంచి ఎంపిక చేశారు. తొలిరోజు అమ్మవారికి పోచంపల్లి వస్త్రాలను అలంకరించనుండగా..రెండోరోజు అమ్మ, స్వామివార్లకు కొత్తకోట వస్త్రాలు ధరింపజేసేందుకు అంగీకరిస్తూ ఆలయ ఈవో లేఖ ఇచ్చినట్లు మాస్టర్‌ వీవర్‌ మహంకాళి రాజేశ్‌ తెలిపారు.

ఇటీవలి మేడారం జాతరకూ ప్రభుత్వం తరఫున అందించిన వస్త్రాలను ఇక్కడి నుంచే సేకరించినట్లు ఆయన వివరించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచనతో పట్టువస్త్రాలను ప్రత్యేక మగ్గంపై తయారు చేయించి యాదాద్రిలో ఛైర్మన్‌ నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డికి అందించినట్లు రాజేశ్‌ తెలిపారు.