’నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవసంయుతం!
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః!!’

భాగవతమును వినేవాళ్ళు ’భాగవతమును నేను వింటున్నాను” అని ఎప్పుడూ వినకూడదు. ’పిబత భాగవతం’ – భాగవతమును తాగేసెయ్యి.  అందుకే మన పెద్దలు పిబత భాగవతం అని చెప్తారు. అంటే భాగవతాన్ని తాగండి అని అర్దం. అదెలా సాధ్యం. భాగవతాన్నిచదవగలం..లేదా వినగలం. కానీ ఎలా తాగుతాం అనే ప్రశ్న ఉదయిస్తుంది. అలా అనడంలో లోతైన అంతరార్థం ఉందంటారు పౌరాణికులు.

ఏదైనా తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో ఉన్నా ఆ పదార్థాన్ని నోరు నేరుగా కడుపులోకి పంపిస్తుంది. ద్రవంలో సాధారణంగా తీసిపారేసేది ఏదీ ఉండదు. ఆ దృఢమైన నమ్మకంతో రెండో ఆలోచన లేకుండా తాగేస్తాం. ‘భాగవతమూ అలాంటిదే. దాన్ని రచించినప్పుడే అనేక వడపోతలు జరిగిపోయాయి.  భక్తులు, భగవంతుల కథలు కాబట్టి, వాటివల్ల అనేకమందికి మార్గదర్శనం అవుతుంది కాబట్టి, దీనిలో తీసి పారేయవలసింది ఏదీ ఉండదు’ అని వేదాంత ప్రవచనకర్తల మాట.   కాబట్టి భావంతో సంబంధం లేకుండా పానం చెయ్యవచ్చు.

భాగవతంలో భగవంతుడు శబ్దరూపముగా వస్తున్నాడు. దానిని నీవు చెవులతో పట్టి తాగేసెయ్యి. విడిచిపెట్టావంటే జారి క్రిందపడిపోతుంది అంటారు. దేనిమీదా అపేక్షలేనటువంటి ఒక మహాపురుషుడు ఈ పై  ప్రవచనం చేశారు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని ఆ భాగవతమును తాగేసెయ్యి. ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది. భూమియందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. అందుకని ఈ భాగవతం అంత గొప్పది.

సదాశివ బ్రహ్మేంద్రులవారు ‘పిబరే రామరసం’ అంటూ రామ నామమనే రసాన్ని పానం చెయ్యండన్నారు. ఇలా విష్ణునామ సంకీర్తనలు చేసినవారంతా పానం చెయ్యమనే చెప్పారు.భాగవతమును సంస్కృతంలో వ్యాసమహర్షి ద్వాదశ స్కంధములలో ప్రవచనం చేశారు. దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యులవారు. . శ్రీ కృష్ణ భగవానులు తమ శరీరమును విడిచిన తరువాత, యావత్ భారతీయులకు వారి లీలలను గాథలను స్మరింపచేసి, మానవుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో తోడ్పడిన పవిత్ర గ్రంథములలో శ్రీమద్బాగవతము ప్రప్రథము అనుట అతిశయోక్తియే కాదు.  

పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?