సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.

 ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఆయన ఎంత గొప్పవాడో పై శ్లోకం స్పష్టంగా చెప్తోంది. మీరు గమనిస్తే ఓ విషయం అర్దమవుతుంది. అది  సూర్య భగవానుడు ఈ విశ్వానికి ప్రాణదాత. ప్రతిరోజూ ప్రత్యక్ష దర్శనం ఇచ్చే సూర్యుడి వల్ల మాత్రమే భూమిపై జీవం ఉందిని తెలుస్తుంది. అందుకే  సనాతన సంప్రదాయంలో సూర్యుడి ఆరాధన పుణ్యమైనదిగా భావిస్తూ చేస్తూ వస్తున్నారు.

అంతెందుకు  సూర్యుని కిరణాలను సైన్స్ కూడా ఆమోదించింది. ఈ కరోనా రోజుల్లో డీ విటమిన్ అత్యవసరం అని చెప్తున్నారు. ఆ విటమిన్ ఇచ్చేవాడు సూర్యుడే.  సూర్యుడు ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ప్రపంచానికి ఆత్మగా భావించే సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారం ఉత్తమమైన రోజు. సూర్య భగవానుని ఆశీర్వాదాలు, ప్రయోజనాలను పొందడానికి ఆదివారం ని ప్రత్యేైకంగా ఎంచుకున్నారు మన పెద్దలు.

పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః

అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.

అందుకే ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలని చెప్తారు. అనంతరం సూర్య భగవానుడికి మూడుసార్లు అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుని స్తోత్రం లేదా సహస్రనామాన్ని భక్తితో పఠించాలి. ప్రతిరోజూ ఆదిత్య స్తోత్రాన్ని పఠించాలి. దీనిని పారాయణం చేయడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది. సూర్యభగవానుని విశేష ఆశీర్వాదం పొందడానికి ఆదివారం ఉపవాసం ఉంటే ఇంకా మంచింది.