“భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్” అని శివపురాణ వాక్యం.
“భర్త్యనాత్ సర్వపాపానాం భాసనం తస్య విద్యయా” అని సూత సంహిత. భాసనము చేత భస్మం. అనగా ‘ప్రకాశ స్వరూపం’, ఙ్ఞాన ప్రకాశం చేతనే కర్మలో దహింపబడుతాయి. సర్వపాపాలను నశింపజేసి, ఙ్ఞానదీప్తిని అందించేది భస్మం.

భస్మధారణ వైదిక సంస్కృతి నుంచి వచ్చినదే.  వేదాల నుంచి శైవమతాలన్నీ ఈ సంప్రదాయాన్ని స్వీకరించి అనుసరిస్తున్నారు. శైవ, వైష్ణవాది శాఖలకు చెందని స్మార్తశ్రౌత ధర్మానుయాయులందరూ భస్మధారణ చేస్తూంటారు. అగ్నిహోత్ర విధులలో యఙ్ఞ ప్రసాదంగా భస్మాన్ని ధరించటమూ మనం గమనిస్తూంటాము. అందుకు కారణం ఏమిటి అంటే…యఙ్ఞ స్వరూపం శివునిగా దర్శించిన శాస్త్రాలు భస్మధారణను పేర్కొనటమే అని చెప్పాలి.

వేద ధర్మంలోకి ఈ విషయమై ఓ సారి తొంగి చూస్తే అనేక విషయాలు బయిటపడతాయి. కర్మకాండలో యఙ్ఞస్వరూపంగా పేర్కొనబడినదే, ఙ్ఞానకాండలో ఙ్ఞానాగ్నికి సంకేతంగా చెప్పబడుతోంది. “అగ్నిసారం భస్మం”, “అగ్నినా రయిమశ్నవత్” – అని వేదోక్తి. ఐశ్వర్యకరమైనది అగ్ని. ఆ అగ్నిస్వరూపాన్ని సోమరూపమైన జలంతో కలిపి ధరించడం విధి. ‘అగ్నిషోమాత్మకం జగత్’ అన్నవిధంగా, శివ – శక్త్యాత్మకమైన అగ్నిషోమతత్త్వానుసంధానమే జలంతో కలిపి భస్మాన్ని ధరించడంలోని ఆంతర్యం. అగ్ని సారమైన భస్మం ఐశ్వర్య స్వరూపం కనుకనే ‘విభూతి’ అని నామాంతరం.  

మాయాశక్తి నుండి కలిగిన జగత్తునకు సత్తాస్ఫూర్తులను అనుగ్రహించిన మహాదేవుడే ‘ప్రకాశకుడు’ కనుక ఆ పరమాత్మకే ‘మహాభస్మ’ అని పేరు. భస్మానికి, భర్తునికీ అభేదభావం. భస్మం శివస్వరూపం.

జలస్నానం మలత్యాగే భస్మస్నానం సదా శుచిః!!

భస్మాన్ని త్రిపుండ్రంగా నిత్యం ధరించువారు ఇహలోకంలో దీర్ఘాయుర్దాయం కలిగి, వ్యాధిరహితులై భోగాలననుభవించి జీవితాంతంలో అనాయాసంగా తనువు చాలించుతారు. పరమపదాన్ని పొందుతారు(శివపురాణం)
జలస్నానం శుభ్రతను ఇస్తుంది. భస్మస్నానం ‘శుచి’ని (సూక్ష్మశరీర శుద్ధి)ఇస్తుంది.

భస్మధారణ చేసి రుద్రాక్షను ధరించి శివనామాన్ని స్మరించేవాడు త్రివేణీ సంగమంవలె పవిత్రమైన వాడు. ఆతడి దర్శనం, స్పర్శనం పవిత్రుల్ని చేస్తుంది.