వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణంలోని ప్రతీ శ్లోకము కూడా మంత్రంతో సమానమే. అందులో సీతాన్వేషణ ఘట్టంతో కూడిన సుందరకాండ ప్రసిద్ధమైనది. ఇందులో వాల్మీకి మహర్షి హనుమంతుడు సీతాన్వేషణకు చేసిన ప్రతీ కార్యమును మంత్రపూరితమైన శ్లోకాల రూపంలో అద్భుతంగా వర్ణించారు.

రామాయణం అంతా రాముడి గురించి అయితే, సుందరకాండ ఆంజనీయుడి అద్భుత విన్యాసాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. అందుకే సుందరకాండకు అంత ప్రత్యేకత. అయితే సుందరకాండ పారాయణ వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయని అందరి నమ్మకం.  సుందరకాండలో ఏది చదివితే ఏ సమస్య తీరిపోతుందని కూడా పండితులు వివరించారు.  సుందరకాండలో ప్రతిపదం, ప్రతి శ్లోకం, మంత్రబద్ధమై ఉంటుంది. అంతే కాదు అదంతా చందస్సులో కూర్చబడి ఉంటుంది. సుందరకాండను  భక్తితో చదివినా, విన్నా,  నిత్యం పారాయణం చేసినా, ప్రవచించినా, బాధలు కష్టాలు తొలగిపోతాయి. రోగాలు  నయమౌతాయి, భయాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది.  మృత్యు భయం పోతుంది. అయితే పారాయణ చేసేందుకు పద్దతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఒక రోజు పారాయణము.
ప్రాతః కాలాన ప్రారంభించి 12 గంటల లోపు పారాయణ జరగాలి.

రెండు రోజుల పారాయణము.
మొదటి రోజు 36 వ సర్గ వరము,
రెండవ రోజు తక్కిన సర్గలూ, పట్టాభిషేకము చదవాలి.

మూడు రోజుల పారాయణము.
మొదటి రోజు 27 వ సర్గ వరకు,
రెండవ రోజున 41 వ సర్గ వరకు,
మూడవ రోజున తక్కిన సర్గలు పారాయణ చేయాలి.

Image Courtesy : WIkipedia

ఐదు రోజుల పారాయణ.
మొదటి రోజు 15 వ సర్గ వరకు చేసి నెయ్యితో చక్కెర పొంగలి నివేదన చేయాలి.
రెండవ రోజు 27 వ సర్గ వరకు చేసి పాయసము, అప్పాలు నివేదన చేయాలి.
మూడవ రోజు 38 వ సర్గ వరకు చేసి నువ్వులు కలిపిన అన్నము నివేదన చేయాలి.
నాల్గవ రోజు 54 వ సర్గ వరకు చేసి చక్కిలాలు నివేదన చేయాలి.
ఐదవ రోజు తక్కిన సర్గలు చేసి లడ్డూలు నివేదన చేయాలి.
ప్రతిరోజు చక్కెర కలిపి కాచిన పాలు ప్రారంభమున ముగింపున ఉండి తీరాలి.

2 మార్లు  17 రోజులు.
ప్రతి దినమూ 8 సర్గలుగా 17 రోజులు భక్తితో పారాయణ చేయాలి.
(పట్టాభిషేకము తప్పక చదవాలి) మహానైవేద్యము ముందు, వెనకాల కాచి పంచదార పాలు, తాంబూలము, పండ్లూ స్వామికి నివేదించాలి.

7 మార్లు 68 రోజులు.
రోజుకు 7 సర్గలుగా  68 రోజులు పారాయణ చేయాలి.

12 మార్లు  48 రోజులు.
1 వ రోజు  15 వ సర్గ వరకు.
2 వ రోజు  32 వ సర్గ వరకు.
3 వ రోజు  51 వ సర్గ వరకు.
4 వ రోజు మిగిలిన కాండమంతా పారాయణ గావించాలి.

24 మార్లు  72 రోజులు.
1 వ మొదటి రోజు  15 వ సర్గ వరకు.
2 వ రోజు  41 వ సర్గ వరకు.
3 వ రోజు తక్కిన సర్గలన్నీ పారాయణ చేయాలి.

32 మార్లు  64 దినాలు.
మొదటి రోజు 38 వ సర్గ వరకు (చూడామణి ప్రధానము),
రెండవ రోజు మిగిలిన కాండమంతా పారాయణ చేయాలి.

సప్త సర్గ పారాయణము.
శాంతి కర్మలన్నియు కలుగుటకు, ఆయుధాలు, చోరుల వలన అగ్ని వలన కష్ట నష్టాలు వస్తే, తీవ్ర రోగాలు వలన గానీ కలిగిన ఈ సుందరకాండ సప్త సర్గ పారాయణ బ్రహ్మాస్త్రము వంటిది. మహారాజ్యము కూడా దీని వలన ప్రాప్తిస్తుంది. దీనిచే ఎంత దుర్లభమైన పదవియైనా లభిస్తుంది. ఈ పారాయణ వలన ఆయువు కావలసినా, ధనము కావలసినా, సంపద కావలసినా, భూమి కావలసినా తప్పక లభిస్తాయి. శుభ తిథి శుభ నక్షత్రమందు ఈ సప్తసర్గ పారాయణము చేయాలి. ప్రతి దినమూ 7 సర్గలు చొప్పున  68 రోజులు పారాయణ చేస్తే అప్పుడు కాండము 7 మారులు పారాయణ జరుగును.

ఇలా సప్త సర్గ పారాయణ చేస్తే అప్పుడు కాండము 7 మారులు పారాయణ 7×68=476 రోజులు చేస్తే మహా సప్త సర్గ పారాయణ అవుతుంది.

సుందరకాండ పారాయణ ఫలితాలు :
ఎలాంటి వ్యాధులైనా తొలగుతాయి

గ్రహ బాధలు తొలగుతాయి

సిరిసంపదలు కలుగుతాయి

ఎలాంటి కష్టాలైనా తొలగుతుంది

అనుకున్న పనులు, శుభకార్యాలు జరుగుతాయి

మోక్షం కోరుకునే వారికి మోక్షం లభిస్తుంది

ఈ పరమ పవిత్రమైన సుందరకాండను పారాయణ చేసి, ఇంకా ఎన్నో ఫలితాలను, అనుభూతులను, ఎందరో మహానుభావులు పొందారు. శ్రద్ధ, భక్తి, నమ్మకంతో పారాయణ చేసేవారికి ధర్మ బద్ధమైన కోరికలు అన్నీ తీరుతాయి.