వేదం ప్రభు సమ్మితం.. ఇలాగే జరగాలి అని శాసిస్తుంది. పురాణం మిత్ర  సమ్మితం.. మంచి చెడ్డలను విశ్లేషణాత్మకంగా అరటిపండు ఒలిచినట్టు హితోక్తితో  చెబుతుంది. కావ్యం కాంతా సమ్మితం.. విషయాన్ని వెన్నపూసంత మెత్తగా, మనసుకు హత్తుకొనేలా చెబుతుంది. రామాయణ; భారత; భాగవత పురాణాలు భారతీయుల, మీదు మిక్కిలి తెలుగువారి ఆరాధ్య నిదర్శన దర్శనాలు. పంచమ వేదంగా  వినుతికెక్కిన భారతం ధర్మప్రతిపాదనతోపాటు రాజనీతిని రంగరించి అందరి  మస్తిష్కాలలో చిరముద్రను వేసింది. భాగవతం నవవిధ భక్తి  ప్రతిపాదనతో భగవంతునికి భక్తునికి అనుసంధాన రాచబాటలను వేసింది. ఇక రామాయణం విశ్వజగతికే అనుసరణీయమైన.. ఆచరణాత్మకమైన కుటుంబ జీవన వైశిష్ట్యాన్ని ; మానవీయ విలువలను ; అనుబంధాల చిక్కదనాన్నీ చాటిచెప్పిన మహత్తర మణిదీపిక.

Image Courtesy : WIkipedia

రామాయణ దర్శనం మానవ సంపూర్ణ దర్శన నిదర్శనం. అందుకే యుగాలు మారినా.. తరాలు గడిచినా నిత్యపఠనీయంగా.. భారతీయ ఆదర్శాలకు జీవగజ్ఞగా నిలిచింది.  రామాయణ; భారత; భాగవత కథలన్నీ పండిత |ప్రకాండుల నుండి పామరుల వరకూ నిత్య సత్య పరిచయాలే. అవన్నీ చర్విత చర్వణాలే. ఆ పురాణాలను  స్థాలీపులాక న్యాయంగా చదివినవారు కొందరైతే సమగ్రంగా చదివి తరించినవారు మరికొందరు. విహంగ వీక్షణంలా చదవడం వేరు.. సాకల్యంగా చదివి అర్థాన్నీ, పరమార్థాన్నీ మనస్సుకి పట్టేలా అవగతం చేసుకొనేలా చదవడం వేరు. అలా మహా భారతంలోని ఓ కథని అర్దం చేసుకుని దాని సారాంశాన్ని మన జీవితంలో కలుపుకుని  ముందుకు వెళదాం.

పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకొన్న తరవాత కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించారు. పట్టాభిషిక్తులైన అనంతరం వారు శ్రీకృష్ణ దర్శనానికి వెళ్లారు. వారి వెంట తల్లి కుంతీదేవి కూడా ఉంది, శ్రీకృష్ణుడు అందర్నీ ఆప్యాయంగా పలకరించాడు.  ద్రౌపదిని పలకరించాడు. పాండవుల విన్నపాలు వింటూనే, కుంతీదేవిని సమీపించి…
 ‘అత్తా! నీ కోరికేమిటి’ ఇంకా ఏమి అయినా కావాలా, అని ప్రశ్నించాడు.

శ్రీకృష్ణుణ్ని కుంతి ఆత్మీయంగా అక్కున చేర్చుకొంది. ‘అందరికీ వరాలిచ్చే దేవుడివి,నాకూ ఓ వరం ఇవ్వరాదా’ అని అడిగింది.

ఏమి వరం కావాలో అడగమన్నాడు కృష్ణుడు.

Image Courtesy : WIkipedia

‘కృష్ణా! ఇంతకాలం ఎన్నో కష్టాలు అనుభవించాం. దీర్ఘకాలం నా తనయులకు దూరంగా గడిపాను.
ఇప్పుడు ధర్మరాజు పట్టాభిషేకం తరవాత, రాజమాత గా సుఖసంతోషాలతో ఆనందాతిశయంలో మునిగి తేలతానే మోనని భయంగా ఉంది. అందువల్ల నాకు ఎప్పుడూ కష్టాలనే ప్రసాదించు’ అని కుంతి వేడుకుంది.

‘జీవితమంతా కష్టాల్లోనే గడిపావు. ఇక ముందు సుఖశాంతిషాలతో బంధు బలగంతో గడపక, నీకు మళ్లీ కష్టాలే కావాలంటున్నావు, ఇదేమి కోరిక’ అని నవ్వుతూ ప్రశ్నించాడు కృష్ణుడు.

‘ కృష్ణా కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ నీ నామస్మరణే చేసేవాళ్లం. ఆర్తిగా నిన్ను తలుచుకోగానే మాకు నీ దర్శనభాగ్యం కలిగేది, కష్టాల్లో ఉన్నవారు ఎప్పుడు కోరినా మీరు ఉన్నపళంగా సాక్షాత్కరించి వారి ఆపదలు తీర్చేవాడివి, ఆశగా పిలిస్తే అభయహస్తం తో నిలిచేవాడివి, బాధతో స్వామీ అంటే బాధ్యతగా చేయందించే వాడివి, దరహాస వర్ఛస్సుతో మీ దర్శనం లభించేది.

ఇప్పుడు నిన్ను ఆర్తిగా పిలవాలంటే అలాంటి పరిస్థితి లేదుకదా, ఆర్థత్రాణపరాయణుడవు అనురాగంతో పిలిచేవారికన్నా ఆవేదనతో పిలిచేవారి వైపే నీ మనసు మొగ్గుతుంది, అందువల్ల నిన్ను దర్శించాలంటే ఇక్కడకు రావాలి, భవబంధ విముక్తా పాహిమామ్ అనగానే, శంకచక్రాలను వదిలి అర్థాంగి కి కూడా చెప్పకుండా భక్తులకు బందీ అయ్యేవాడివి  ఇక్కడకు వచ్చినా నీ దర్శనభాగ్యం కలుగునో లేదో కదా. అందుకే మాకు ఆ కష్టాలే ప్రసాదించు స్వామి అని వేడుకోంది..

ఇందులోంచి మనం తెలుసుకోవాల్సిన నీతి….ఏమిటంటే… నిజమైన భక్తులు భగవంతుడి కోసం తాపత్రయ పడుతుంటారు,సుఖాల కోసం కాదు,ఆ భగవంతుడు  వెంట  ఉంటే అన్ని ఉంటాయి,అన్ని ఉండికూడా భగవత్ అనుగ్రహం లేకపోతే  ఏమీలాభం లేదు…