ప్రతీ సంవత్సరం కొండకోనల నడుమ కన్నులపండువగా జరిగే వన దేవతల జాతర కోసం అందరూ ఎదురు చూస్తూంటారు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం  16వ తేదీ నుంచి 19వ తేదీవరకు నాలుగు రోజులపాటు జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతన్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ శోభాయమానంగా పూజలు జరపటానికి రంగం సిద్దమవుతోంది. ఆ వేడుక జరిగే విధానం చూద్దాం.

గుడిమేలుగే పండగ
 సమ్మక్క, సారలమ్మలు కొలువుదీరిన మేడారం, కన్నెపల్లిల్లో జరిగే గుడిమేలుగే పండగతో ఈ వేడుక ప్రారంభమవుతుంది.అమ్మవార్ల ఆలయాల శుద్ధి కార్యక్రమమే గుడిమేలుగే. కాక వంశీయులు, సిద్ధబోయిన వంశీయులు దీన్ని నిర్వహిస్తారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాల నడుమ అడవుల్లోకి వెళ్లి గుట్టగడ్డిని సేకరించి, దాన్ని వన దేవతల మందిరాలపై కప్పుతారు. గద్దెలను అలికి, ముగ్గులతో అలంకరిస్తారు. ఆ తర్వాత కోయ పూజారులు పూజ చేసి అఖండదీపం వెలిగించడంతో మహా జాతరకు అంకురార్పణ జరుగుతుంది.

ఆ తర్వాత గద్దెపైకి సారలమ్మ
 మేడారం జాతరలో తొలిఘట్టమిది. సమ్మక్క బిడ్డ సారలమ్మను మేడారం గద్దెపైకి ఆహ్వానించి ఆశీనురాలిని చేస్తారు. కన్నేపల్లిలో సారలమ్మ ఆలయంలో ఆరోజు ప్రాతఃకాలంలో గోప్యంగా పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ గ్రామస్థులు సారలమ్మకు అమిత భక్తితో వీడ్కోలు చెబుతారు. హారతులు పట్టి ఉత్సవాలు చేస్తారు. అమ్మను అక్కడి నుంచి జంపన్న వాగు మీదుగా మేడారం తీసుకొచ్చి గద్దెపైకి తీసుకెళతారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను కూడా గద్దెపైకి తీసుకొస్తారు. వివాహంకానివారు, సంతానంలేనివాళ్లు, దీర్ఘవ్యాధులతో బాధ పడేవాళ్లు అమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు.

ఆ తర్వాత సమ్మక్కకు ఆహ్వానం

చిలకలగుట్టలో కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చే సందర్భం. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే మహా సంరంభమిది. ఆ రోజు సాయంత్రం గద్దెపైకి అమ్మవారిని పూజాపీఠంపైకి ఆహ్వానించి ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరుగుతుంది.

దర్శనం
ఆతర్వాత రోజు …సమ్మక్క, సారలమ్మలు భక్తులకు దర్శనమిచ్చే రోజు. గద్దెపై కొలువుదీరిన వన దేవతలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను అశేష భక్తజనం చూసి తరిస్తారు. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. మహిళలు అమ్మవార్లకు పసుపు, కుంకుమ, నూనె కలిపిన ఒడిబియ్యం సమర్పిస్తారు. అలాగే బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని అర్పిస్తారు.

తిరుగు ప్రయాణం

లక్షలాది మంది భక్తులను అనుగ్రహించిన సమ్మక్కసారలమ్మలు తిరిగి వనాల్లోకి తరలిపోతారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుక నిర్వహిస్తారు.

 భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు సిద్దపడుతున్న నేపథ్యంలోనే అక్కడి అధికారులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.. భక్తులందరూ కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.