రెండేళ్ల కోసారి జరిగే మేడారం సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా దేశం నలుమూలల నుండి భక్తులు మేడారం వస్తూంటారనే సంగతి తెలిసిందే. కోరిన కోరికలు తీర్చే సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కలు చెల్లించుకున్న అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లో తనివితీరా ఆనందిస్తూంటారు.. ఓ రకంగా చెప్పాలంటే మేడారం జాతర అంటేనే పూర్తిగా నాన్ వెజ్ జాతర.. మద్యం, మాంసాహారాలు అక్కడ సర్వసాధారణం. మేడారం చుట్టూ దట్టమైన అడవి, పక్కనే జంపన్నవాగు, చిన్న చిన్న సెలయేర్లు కనిపిస్తూ ఓ రకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాయి.   వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తులు అడవి తల్లి ఒడిలో   ప్రకృతి అందాల మధ్య గడపటాన్ని ఆస్వాదిస్తూంటారు.

మేడారం జాతరకు తెలంగాణ సర్కార్‌‌ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను నడపనుంది. ఇక ఈ ఏడాది కొత్తగా మరో విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka Sarakka) వార్ల ప్రసాదాన్ని నేరుగా ఇంటికే పంపించే సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఈ సారి మేడారం ప్రసాదాన్ని డోర్‌ డెలీవరీ చేయనున్నట్లుగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి (Indrakaran Reddy)తెలియచేసారు.

అమ్మవారి ప్రసాదంను డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించు కోనున్నామని మంత్రి  చెప్పుకొచ్చారు. భక్తుల ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బెల్లం- బంగారం ప్రసాదం అమ్మవారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి మళ్లీ దాన్ని భక్తులకు అందేజేయనున్నట్లు వెల్లడించారు.

ఆన్ లైన్ లో మీ సేవ లేదా టీయాప్ ఫోలియో TAPP-FOLIO (మొబైల్ ప్లే స్టోర్ డౌన్ లోడ్ చేసుకుని )లో బుక్ చేసుకోవాలన్నారు. అనంతరం భక్తులకు పోస్టల్ సేవల ద్వారా అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఈ సేవలకు గాను ఒక ప్రసాదం ప్యాకెట్ కు భక్తులు రూ. 225 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు కుంకుమ, అమ్మవారి ఫోటో ను భక్తులకు ఇంటి వద్ద అందజేస్తామన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఇంటికే ప్రసాదం అందించనున్నామని.. ఈ సేవలను  భక్తులు వియోగించుకోవాలని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి కోరారు.