హనుమంతుడు అనగానే అపారమైన భక్తి, పరాక్రమం… అసమానమైన మేథస్సు… వినయం, విధేయతలు గుర్తుకొస్తుంటాయి. ఒక భక్తుడు ఎలా ఉండాలో… ససాక్ష్యంగా నిరూపించిన భగవంతుడు హనుమంతుడు. అనేక ప్రాంతాల్లో అనేక నామాలతో ఆవిర్భవించిన ఆయన భక్తాంజనేయుడుగా… వీరాంజనేయుడుగా, వరాల ఆంజనేయుడిగా, పంచముఖ ఆంజనేయుడిగా, మారుతిగా అభయాన్ని ప్రసాదిస్తూ వుండే స్వామి. ఎక్కడ చూసినా నుంచునే దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన జయంతిని వాడవాడలా భక్తులు జరుపుకుంటూంటారు. అయితే ఈ జయంతి విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి.

హనుమజ్జయంతి చైత్రంలోనా, వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు.
పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి. అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది.
దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు.
ఈ రోజున ఉయ్యూరులోని సువర్చలా సహిత ఆంజనేయ స్వామికి వైభవంగా వివాహ మహోత్సవం జరుగుతుంది. ఇంకా హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. “కలౌ పరాశర స్మృతి:” అని శాస్త్రాలు చెప్తున్నాయి.
ఈ చైత్ర పూర్ణిమ నుంచి వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల పాటు హనుమాన్ మండల దీక్షను చేపడతారు. కఠిన బ్రహ్మచర్యం మొదలైన నియమాలు పెట్టుకుని, నిత్యం ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. అంత కఠిన నియమాలు పాటించకున్నా, మనం కూడా నిష్ఠగా ఈ మండలం రోజులు నిష్ఠగా ఒక్కసారి లేదా 5 సార్లు చాలీసా పారాయణ చేస్తామని సంకల్పం చెప్పుకోవచ్చు. నిజానికి ఇప్పుడిది అత్యవసరం కూడా. ఎందుకంటే హిందూ సమాజంలో జాడ్యం, బద్దకం, నిర్లిప్తత, తమస్సు మొదలైన గుణాలు పెరిగిపోయాయి.
అవన్నీ వదలాలంటే, తప్పకుండా ఆంజనేయ స్వామి వారిని వేడుకోవాలి. అప్పుడే హిందువుల్లో చైతన్యం ఉట్టిపడుతుంది, జడత్వం నశిస్తుంది. కనుక సనాతన ధర్మ పునర్వైభం, భారతదేశ సంరక్షణ, ప్రపంచ శాంతి అనేవి సంకల్పాలుగా చేసుకుని, మనం కూడా ఈ 40 రోజుల పాటు ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయవచ్చు. మన కోసం చేసిన పూజ కంటే, పదిమంది మేలు కోరి చేసింది, మరింత ఫలితం ఇవ్వడమే కాదు, మనకు శీఘ్ర ఫలాన్ని, రక్షణను, కామ్యసిద్ధిని, కార్యసిద్ధిని ఇస్తుంది.
ఓం శ్రీ హనుమతే నమః
శ్రీ రామదూతం శిరసా నమామి
జై శ్రీ రామ
రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ
జై హనుమాన్