సాధారణంగా మనమంతా శనీశ్వరుడు పేరు చెప్పగానే కంగారుపడిపోతాం. శనిపట్టిందిరా అని తిట్టేసుకుంటాం. జాతకంలో శని నడుస్తోంది అనగానే తెగ ఆందోళన పడిపోతాం.  శని ప్రభావం మన జీవితాలపై ఉండకూడదని కోరుకుంటాం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది. అయితే అవన్నీ జీవితంలో వచ్చే మిగతా గ్రహాల దశలాంటివే అని మర్పిపోతాము.

అయితే శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శివుడిలా, వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శనీశ్వరుడికి భయపడాల్సిన పనిలేదు. నవగ్రహా మండపానికి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయమంటున్నారు. అప్పుడు చదవాల్సిన మంత్రం ఇదీ…

’నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం’

నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు, రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు, యమాగ్రజం-యముడికి సోదరుడు, ఛాయా మార్తాండ సంభూతం: ఛాయా దేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు, తం నమామి శనేశ్చరం: అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు.

అలాగే విశేష అనుగ్రహం కలగాలంటే శనీశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే శనీశ్వర క్షేత్రాలకు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రఖ్యాతమైన శనీశ్వర క్షేత్రం ఉంది. అదే మందపల్లి.

మందపల్లి శనేశ్వరస్వామిగా మహాదేవుడు కొలువై ఉన్నాడు. ఆయన పక్కనే పార్వతీ దేవి కూడా కొలువై ఉంది. ఈ పార్వతీదేవిని సప్తమాతృకలుప్రతిష్ఠించారని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది.  మందపల్లి శనేశ్వరస్వామిని ప్రార్థించినవారికి శనేశ్వరుని వలన కలిగే ఏముప్పు దరిచేరదు.

ఈ మందేశ్వర స్వామికి నిత్యం తైలాభిషేకాలు జరుగుతాయి. నువ్వులనూనెతో అభిషేకించిన వారికి సమస్తపాపాలు దూరం అవుతాయని ఇక్కడి నివాసితులు చెప్తారు. ఈ మందేశ్వర స్వామిని దర్శించి నల్లని వస్తమ్రు, ఇనుపరేకు ఇక్కడికి దగ్గరలో ప్రవహించే నదిలో విడిచి పెట్టడం ద్వారా శని పీడ దూరమవుతుందని అంటారు.