ఓం నమః శివాయ లేదా ఓం నమశ్శివాయ ….ఇదే  శివ పంచాక్షరీ మంత్రము. శైవంలో భక్తులు ధ్యానించే దివ్య మంత్రం. ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. ఈ సృష్టిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు. ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనదిగా మన పురాణాలు చెప్తున్నాయి. ఈ మంత్ర స్మరణ  శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావిస్తారు. ఈ మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు అగ్ని, గాలి, ఆకాశాన్ని సూచిస్తుంది. ఈ మంత్రం ఉచ్చరస్తే కలిగే ఫలితాలు అంతా ఇంతా కాదు..అవేమిటో చూద్దాం.

 పంచాక్షరీమహా మంత్రాన్ని అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షంగా అభివర్ణిస్తుంది హిందూ మతం. దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని చెప్తారు. భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే ‘అధికస్య అధికం ఫలమ్‌’ అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది.

ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి. ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది. కాబట్టి, దాన్ని వదిలేసి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు.  న, మ, శి, వ, య. మంత్రం’ ‘ఓం’ కారంతో ప్రారంభం అవుతుంది. ఓం… మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి.

‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తున్నా ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు. ‘న, మ, శి, వా, య‘ అనే ఐదు ముఖాలకు చైతన్యం ఇచ్చేది సాక్షాత్తు పరమేశ్వరుడు. అందుకే ఈ దేవుడిని ప్రపంచ నాయకుడిగా కొలుస్తారు.

ఎలా స్మరించాలి…

ఓం నమ శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదని వేద వాక్కు. ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. తెల్లవారు జామునే స్నానం చేసి, నిటారుగా కూర్చోవాలి. కళ్లు మూసుకుని, జప మాల తీసుకుని ‘ఓం నమ: శివాయ‘ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాలి.అప్పుడే మనస్సు పవిత్రంగా ఉండి,దృష్టి కుదురుగా ఉండి అనుకున్న పనులు అనుకున్నట్లు అయ్యిపోతాయి.