“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!”

ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతీ యుగంలో జన్మిస్తూనే ఉంటానని భగవద్గీత నాలుగో అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ.

‘ధర్మ సంస్థాపనకోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటా’నని శ్రీమహావిష్ణువు అభయ ప్రదానం చేశాడు.  మొదట మత్య్సావతారం. పూర్తిగా నీటిలో ఉండే జీవి. ఈ అవతారంలో సోమకాసురుణ్ణి సంహరించి, వేదాలను రక్షించాడు. సోమకాసురుడు వేదాలను తీసుకెళ్ళి నీటిలో పెట్టాడు. అందుకే భగవంతుడు మత్స్యావతారం ఎత్తాడు. సమూహ శక్తి, సామాజిక శక్తిలో నుంచి భగవంతుడి అవతారం పుడుతుంది. తరువాత కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం. ఐదో అవతారం వామనమూర్తి. ఆరో అవతారం పరశురామ అవతారం. ఏడో అవతారం పరిపూర్ణ మానవావతారం రామావతారం. ఆ తరువాత శ్రీకృష్ణావతారం. చివరగా తొమ్మిదోది బుద్ధుని అవతారం.ఇక కల్కి అవతారం.

ఆ పరంపరలో ఆవిష్కారమైన అయిదోది వామనావతారం. భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి , కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తిగా అవతరించాడు. దీన్ని వామన ద్వాదశిగా , విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు. సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్యభరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం , మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ , ఆ వైవిధ్యం ఆత్మ , పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది , మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో , అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే !

వామనావతార విశేష కథేమిటి అంటే… ఓసారి బలి చక్రవర్తి ఇంద్రుణ్ని ఓడించి , స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసులు అనేక అకృత్యాలకు పాల్పడసాగారు. దాంతో దేవతల మాతృమూర్తి అదితి కలత చెంది , కేశవుణ్ని వేడుకుని , అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడు దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు. అతనికి ఉపనయన సంస్కారాలు జరిగాయి. బ్రహ్మ తేజస్సు , దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని , గొడుగును , కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు.

‘స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు…’ అంటూ బలిని ఆశీర్వదించాడు. సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు. వామనుడి వర్చస్సు , వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. ‘కేవలం నా పాదాలకే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రం నాకివ్వు చాలు’  అన్నాడు వామనుడు. ఆ వటుడి రూపంలాగానే అతడి కోరిక కూడా కురచగానే ఉందని బలి భావించాడు. భూ దానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు.

అయినా బలి శుక్రుడి మాట వినకుండా , వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు. త్రివిక్రముడిగా వామనుడు విరాట్‌ రూపాన్ని సంతరించుకుని , ఓ పాదంతో భూమినీ , మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి , మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి , అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు. బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.

 బలి దాన గుణానికి సంతోషం చెందిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. ఇప్పటికీ కేరళలో ఓనం పండగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణువుని పూజిస్తే శుభప్రదం. ఎదుటివారిని అహంకారంతో చులకనగా చూసే దుష్టులకు తగిన గుణపాఠం నేర్పి , వారికి సక్రమ మార్గ నిర్దేశం చేయడమే వామనావతార రహస్యం.