శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం

స్వామివారిని స్మరిస్తే, ఎక్కడ లేని బలం పుంజుకొస్తుందని అనుభవించిన వారు చెప్పే మాట. ఆయన్ని తలిస్తే శరీరమంతా తెలియని ధైర్యం ఆవహిస్తుంది. అలాంటి హనుమంతుడి మహిమలు ఎన్నని చెప్పగలం.

ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నా  ప్రత్యేకతే. ఆయన విగ్రహాలు సైతం భారీగా అతి పెద్దవిగా కనపడతాయి. అలాగే స్వామివారు మిక్కిలి బలవంతుడు. కాబట్టి, తన బలాన్ని మనకు ప్రసాదిస్తాడనే నమ్మకంతో ఆయన్ని మ్రొక్కుతూంటాము. ఆయనను పూజిస్తే, ఎలాంటి భయాలూ దరి చేరవని విశ్వాసం. అందుకే ఊరి పొలిమేర్లలో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. రోడ్ల ప్రక్కన చాలా చోట్ల , పెద్ద పెద్ద నిలువెత్తు హనుమంతుడు విగ్రహాలు ఆశీర్వదిస్తూ కనిపిస్తాయి. దేశమంతటా ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా హనుమంతుడి విగ్రహాలు దారిపొడుగునా దీవెనలు అంద చేస్తూనే ఉంటాయి.అయితే ఇప్పుడు మనం ఓ ప్రత్యేకమైన హనుమంతుడి గురించి చెప్పుకుందాం. ఆయనే శ్వేతార్క హనుమాన్‌.

సాధారణంగా ..గణపతి స్వరూపమైన తెల్లజిల్లేడు వేరును యథాతథంగా శ్వేతార్క గణపతిగా పూజించడం తెలిసిందే. అలాగే శ్వేతార్క మూలంపై ఒక్కోసారి గణపతి ఆకారం సహజసిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది. అది మరింత విశేషమైనది. వినాయకుని విశిష్టతలతో కూడిన శ్వేతార్కమూలంపై ఆంజనేయుని రూపు తీర్చిదిద్దించి, దానిని ఆంజనేయ మూల మంత్రంతో ప్రాణప్రతిష్ఠ జరిపించి పూజిస్తారు. ఆయనే  శ్వేతార్క హనుమాన్‌.

శ్వేతార్క హనుమాన్‌ ని పూజించటం ద్వారా పిల్లలకు బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి. జాతకరీత్యా ఏర్పడే బాలారిష్టాలు పన్నెండేళ్ల వయసు నిండేంత వరకు పిల్లలను పీడిస్తాయి. బాలారిష్టాల కారణంగా పిల్లలు తరచు ఆరోగ్య సమస్యలకు, ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. లేనిపోని భయాలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి దోషాలను నివారించడానికి శ్వేతార్క హనుమాన్‌ ఆరాధన బాగా ఉపయోగపడుతుంది. శ్వేతార్క ఆంజనేయ స్వామిని హనుమజ్జయంతి నాడు పూజించడం శ్రేష్టం. లేదా అక్షయతృతీయ నాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి పూజ జరుపుకోవడం ఉత్తమం. ఈ రోజుల్లో వీలు కుదరకపోతే, మంగళవారం లేదా శనివారం నాడు ప్రార్ధించవచ్చు. ఆవేళ దశమి తిధి గనుక కలసివస్తే మరీ మంచిదని చెబుతారు.

అలాగే తెల్లజిల్లేడు వేరుపై ఆంజనేయుని రూపును తయారు చేయించి, సిందూరంతో అలంకరించి, పూజ మందిరంలో ఉంచి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించాలి. శ్వేతార్క హనుమాన్‌ అర్చనలో భాగంగా ఉభయ సంధ్యల్లోనూ హనుమాన్‌ చాలీసాను పదకొండుసార్లు చొప్పున పఠించాలనేది గురు వాక్యం. తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి.

పూజ ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. నీరాజనం, మంత్రపుష్పం మొదలైన సేవలు ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామి పాదాల వద్దనున్న అక్షింతలు తీసి, తలమీద జల్లుకోవాలి. ఆ తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ఉద్వాసన చెప్పి, విగ్రహం తీసి, పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాలి