”శంకరః సాక్షాత్ శంకరః” అని స్తుతింపబడిన ఆదిశంకరాచార్యుడు పరమ శివ అవతారముగా పరిగణింపబడిరి. ఆయన స్వయంగా రాసిన శివానందలహరి ..హిందు బంధువులకు అనేక విషయాలలో ప్రామాణికం. ఆదిశంకరులు రచించిన మూడు వందలకు పైగా వివిధ దేవతా స్తోత్రములలో అతిప్రసిద్ధమైనవి శివానంద, సౌందర్యలహరులు. ఈ రెండింటిలోను శివానందలహరి కేవలము భక్తిప్రధానమైన ఉత్తమ స్తోత్ర గ్రంథము. శివానందలహరి అనగా శివుని సేవించుచున్నప్పుడు లేక ధ్యానించునప్పుడు భక్తులు పొందే ఆనందప్రవాహము అని అర్థం. శంకరులు శివుని గుణములను అనేక శ్లోకములలో వివరించిరి. ఆయన శ్లోకమునందలి విశేషణములు కొన్ని రూపవర్ణన పరములుగా ఉన్నను, కొన్ని పరబ్రహ్మ సూచకములు, సాభిప్రాయములు. ఆ శివానంద లహరిలోని ప్రధమ శ్లోకం ..దాని తాత్పర్యం ఇక్కడ చూద్దాం.

“కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం’ “
తాత్పర్యం:
ఈ శ్లోకం ఆది శంకర భగవద్ పాదులవారు రచించిన శివానందలహరి లోని పరమేశ్వర వైభవాన్ని వర్ణిస్తూ స్వామి వారు చేసిన ప్రధమ శ్లోకం.
సకల విద్యాస్వరూపులునూ , సిగలపై అలంకరింౘుకొనిన చంద్రరేఖలు గలవారు నూ, ఒండొరుల తపస్సు నకు ఫలంగా దాంపత్యమును పొందిన వారు నూ, భక్తులకు అభీష్ట ఫలములను ఇౘ్చువారునూ ,, ముల్లోకములకూ అధికమైన మంగళములను ఇౘ్చువారునూ, ధ్యానము చేయువారల హృదయంలో మాటిమాటికీ సాక్షాత్కరింౘు వారునూ, ఆనందంతో పాటు స్ఫురింౘు అనుభవం గలవారునూ, అయిన పార్వతీపరమేశ్వరుల కు నా నమస్కారములు
ఈ శ్లోకం లో పార్వతీపరమేశ్వరుల సామ్యాన్ని చూపించేరు. పార్వతీపరమేశ్వరులు అభిన్నులు వారిలో ఏ ఒక్కరినో అర్చించడం సాంప్రదాయం కాదు కాబట్టి శంకరులు ఇద్దరిని కలిపి అభివర్ణించి నమస్కరించడం ఈ శ్లోకంలో విశేషం. ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల నిద్దరినీ ఉద్దేశించి చేసిన ప్రార్థనా శ్లోకమిది. శివా శివులిద్దరూ ఒకరిని ఒకరు ఆశ్రయించి ఉంటారు.
“శివశ్శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం” అనగా శివుడు శక్తితో కలసి నపుడే, సృష్టికార్యానికి శక్తుడవుతాడని శంకరులు సౌందర్య లహరి లో చెప్పియున్నారు. ఈ శ్లోకం లో పార్వతీపరమేశ్వరులు ఉభయులు ఒకరికోసం ఒకరు తపస్సు చేసుకొని ఆదిదంపతులు అయ్యారు. వీరు ఉభయులు భక్తుల కోరికలు తీర్చేవారు కాబట్టి “భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం” అని ప్రశంశించబడ్డారు. అటువంటి ఆదిదంపతులను భక్తితో నమస్కరిస్తే ఐహిక ఆముష్మిక ఫలములు లభిస్తాయని శ్లోక తాత్పర్యం.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే ।
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్ ! నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్!